భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ):కొత్త సర్కారు కొలువుదీరి ఎనిమిది నెలలుగా అవుతున్నా పల్లెల్లో కొత్తగా వచ్చిన మార్పులేమీ కన్పించడం లేదు. పైగా అవి మునుపటి ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయాయి. గత కేసీఆర్ పాలనలో ‘పల్లె ప్రగతి’ పేరుతో వర్షాకాలమంతా కొనసాగిన కార్యక్రమానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడినట్లు కన్పిస్తోంది. పల్లెల్లో విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులే ఇందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి.
మొత్తంగా కొత్త ప్రభుత్వం పంచాయతీల్లో పారిశుధ్యం పడకేసింది. విష జ్వరాల కేసుల భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. లక్ష్మీదేవిపల్లి మండలం మైలారంలో ఇటీవల ఏకంగా 8 మంది మరణించడం, సుజాతనగర్ మండలం గరీబ్పేటలోనూ పదుల సంఖ్యలో విష జ్వరాల మరణాలు ఉన్నాయనే కథనాలు రావడం వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
పంచాయతీల పాలకవర్గాల గడువు ముగిసి నెలలు గడుస్తున్నా పట్టించుకోని ప్రస్తుత ప్రభుత్వం.. ప్రత్యేక అధికారులతో పల్లె పాలనను నెట్టుకొస్తోంది. ఇక నిధుల ఊసు అసలే మరిచింది. కనీసం పారిశుధ్య కార్మికులకూ నెలల తరబడి వేతనాలు ఇవ్వడం లేదు. చివరికి గ్రామాల్లో బ్లీచింగ్, ఫాగింగ్ వంటి పారిశుధ్య, వ్యాధుల నివారణ చర్యలు కానరావడంలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పల్లెల్లో పారిశుధ్యం పూర్తిగా పడేకేసింది. మురుగునీరంతా వీధుల్లో ప్రవహిస్తుండడం, కొన్ని చోట్ల కాలువల్లో మురుగు పేరుకుపోవడం, ఓ వైపు దుర్గంధం వెదజల్లుతుండడం, మరోవైపు దోమలు విజృంభిస్తుండడం, బ్లీచింగ్, ఫాగింగ్ వంటివి కనీసంగా కూడా కానరాకపోవడం వంటి కారణాలతో పల్లె ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. గడిచిన పదేళ్లుగా ఉన్న కేసీఆర్ ప్రభుత్వ పాలనలో ఇలాంటివేమీ మచ్చుకైనా లేవు. వర్షాకాలం ప్రారంభంలోనే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి పారిశుధ్యాన్ని మెరుగుపర్చారు. దీంతో వ్యాధుల జాడే కన్పించేది కాదు. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో పల్లెల పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉండడం గమనార్హం. ఇదే అంశంపై ఇటీవల జరిగిన జడ్పీ సమావేశంలోనూ బీఆర్ఎస్ జడ్పీటీసీలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే పంచాయతీ పాలనకు పెద్దదిక్కుగా ఉన్న డీపీవో పోస్టు ప్రస్తుతం ఇన్చార్జితోనే కొనసాగుతోంది. పంచాయతీ కార్యదర్శులు మాత్రమే రెగ్యులర్ పోస్టుల్లో ఉన్నారు. డీఎల్పీవోలు, ఎంపీవో పోస్టులు కూడా ఇన్చార్జులతోనే కొనసాగుతున్నాయి. దీంతో పల్లె పాలన గాడితప్పుతోంది.
పారిశుధ్యంపై అధికారులు దృష్టి పెట్టకపోవడంతో పల్లెల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వరాల కారణంగా లక్ష్మీదేవిపల్లి మండలం మైలారంలో ఇటీవల 8 మంది చనిపోయారని అక్కడి జడ్పీటీసీ ఇటీవలి జడ్పీ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఇక సుజాతనగర్ మండలం గరీబ్పేటలో కూడా జ్వరాల మృరణాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. దీంతో వైద్యశాఖ అధికారులు అక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటుచేశారు. కానీ అంతకుముందు పంచాయతీ అధికారులు అక్కడ పారిశుధ్య పనులు చేపట్టి ఉంటే ఇన్ని మరణాలు సంభవించేవి కావంటూ అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వం నుంచి నిధులురాని కారణంగా పల్లెలన్నీ చిన్నబోతున్నాయి. గతంలో చేసిన పనుల బిల్లులను కూడా ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేయడం లేదు. పన్నుల వసూళ్లు అంతంతమాత్రంగానే ఉంది. తాగునీటి సమస్య వచ్చినప్పుడు ఒక్కోసారి తాము సొంతంగా ఖర్చులు భరించాల్సి వస్తోందని కొందరు కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పారిశుధ్యంపై అధికారులు దృష్టిపెట్టాలి. జిల్లా పంచాయతీ అధికారి అన్ని పంచాయతీలను పరిశీలిస్తే సమస్య తీవ్రత ఏంటో తెలుస్తుంది. ప్రతీ జడ్పీ సమావేశంలోనూ సమస్యల గురించి చెబుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. అసలు నిధులు లేకుండా పాలన ఎలా జరుగుతుంది? రోజూ పనిచేయించుకుంటూ కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం దారుణం.
-మేరెడ్డి వసంత, జడ్పీటీసీ, లక్ష్మీదేవిపల్లి
జిల్లాలోని పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. గత కేసీఆర్ ప్రభుత్వ పాలనలో పల్లెలు పట్టణాలతో పోటీపడేవి. కానీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఆ పరిస్థితి లేదు. ఈ పల్లెలను ఈ ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోవడం లేదు. పంచాయతీ ఎన్నికలు పెట్టలేదు. పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో పల్లెల సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తాం. పారిశుధ్య సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం.
-రేగా కాంతారావు, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు