ఖమ్మం, మార్చి 1 : తన ఐదేళ్ల పదవీ కాలంలో వివిధ అభివృద్ధి పనులకు వంద శాతం నిధులు సద్వినియోగం చేసుకున్నామని, ఉమ్మడి జిల్లాకు తన ఎంపీ నిధుల నుంచి 218 పనులకు.. రూ.9.80 కోట్లతో ప్రతిపాదనలు పంపగా.. ఇప్పటివరకు 201 పనులకు.. రూ.9.38 కోట్లు మంజూరైనట్లు బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. మంజూరైన ఎంపీ నిధులను సీసీ రోడ్లు, కల్వర్టులు, పాఠశాలలు, హెల్త్ సెంటర్, అంగన్వాడీ భవనాల ప్రహరీల నిర్మాణానికి, విద్యుత్ స్తంభాలు, కొత్త లైన్ల ఏర్పాటుకు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 19 పనుల కోసం రూ.79.50 లక్షలు, ఖమ్మం జిల్లాలో రూ.4,16,60,000 కేటాయించినట్లు పేరొన్నారు. పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని ఎంపీ నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఖమ్మం కార్పొరేషన్లో 14, 3, 34, 38 డివిజన్లకు తాజాగా ఎంపీ నిధులు కేటాయించినట్లు పేరొన్నారు. ఆయా పనులకు త్వరలోనే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు నామా స్పష్టం చేశారు.