అశ్వారావుపేట, అక్టోబర్ 11 : వాహన తనిఖీల్లో భాగంగా కారులో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న నిందితులను పోలీసులు అనుమానంతో వెంబడించి పట్టుకున్నారు. ఇందులో ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా.. మరో నలుగురు పారిపోయారు. పట్టుకున్న నిందితుల వద్ద నుంచి ఒక కారు, నగదు, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అశ్వారావుపేట పోలీస్‌స్టేషన్‌లో సీఐ పింగళి నాగరాజు శనివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. జంగారెడ్డిగూడెం రోడ్డులోని ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీ సమీపంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్సై రామ్మూర్తి, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావులతో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో ఏపీ రాష్ట్రం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి అశ్వారావుపేట వైపు వస్తున్న ఓ కారును పోలీసులు అనుమానంతో గుర్తించారు. దీంతో పోలీసులను చూసి తప్పించుకోగా కొంత దూరం వెంబడించి పట్టుకున్నారు. తర్వాత కారులో తనిఖీలు చేపట్టగా.. 222 కిలోలు గల 111 ప్యాకెట్ల ఎండు గంజాయి దొరికింది. దాని విలువ సుమారు రూ.1.10 కోట్లు ఉంటుంది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎస్కార్ట్‌గా వస్తున్న మరో కారు తప్పించుకుంది. పోలీసులు పట్టుకున్న కారులో ఉన్న హైదరాబాద్‌కు చెందిన సరిన్కుమార్, బెల్లంపల్లికి చెందిన బాబర్ ఖాన్‌లను అదుపులోకి తీసుకున్నారు.
వీరిని విచారించగా.. విశాఖపట్నంకు చెందిన పంగి శ్రీను వద్ద రూ.4 లక్షలకు గంజాయి కొనుగోలు చేసి, మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన ఇంతియాజ్‌కు విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు వివరించారు. సరిన్కుమార్, బాబర్ ఖాన్‌లను అరెస్ట్ చేసి.. వారి వద్ద నుంచి రూ.222 కేజీల గంజాయి, ఒక కారు, రెండు సెల్ఫోన్లు, ఒక జియో రూటర్, రూ.4 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు.
వీరితోపాటు ఎస్కార్ట్‌గా వచ్చిన హైదరాబాద్‌కు చెందిన ఫిరోజ్, సంతోశ్, విశాఖపట్నంలో గంజాయి విక్రయించిన పంగి శ్రీను, నాగపూర్‌కు చెందిన ఇంతియాజ్‌లు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. సరిన్కుమార్పై ఇప్పటికే రెండు ఎన్డీపీఎస్ కేసులు ఉన్నట్లు చెప్పారు. సమావేశంలో ఎస్సై రామ్మూర్తి, సిబ్బంది కృష్ణమూర్తి, సంతోశ్, రమేశ్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. కాగా.. భారీ స్థాయిలో గంజాయి పట్టుకున్న అశ్వారావుపేట పోలీసులు, కొత్తగూడెం టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.