‘తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా.. కేసీఆర్ అనే మొక్కను ఇకపై మొలవనీయను..’ అంటూ అన్ని సభల్లో శపథాలు చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి.. అందుకు అనుగుణంగానే కుట్రలు పన్నుతున్నారు. స్వరాష్ట్ర సాధకుడి పేరు వినిపించినా, కనిపించినా కలవరం చెందుతున్న ఆయన.. ‘కేసీఆర్’ పేరుతో ఉన్న పథకాలను పూర్తిగా పక్కకు పెట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే అనేక పథకాలను ఇందులో చేర్చినప్పటికీ తాజాగా మరో పథకమూ వెలుగులోకి వచ్చింది. మైనార్టీల్లోని ఒంటరి మహిళల ఆర్థికాభివృద్ధికి ఉపకరించేందుకు ‘కేసీఆర్ తోఫా’ పేరుతో తీసుకొచ్చిన కుట్టుమిషన్ల పంపిణీని కూడా అటకెక్కించారు.
-భద్రాచలం, డిసెంబర్ 12
ఏడాది క్రితం అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ పథకం వచ్చింది. దీనిలో భాగంగా అప్పటికే కొంతమంది లబ్ధిదారులకు కుట్టుమిషన్లను అప్పటి ప్రభుత్వం పంపిణీ చేసింది. ఆ సమయంలో వచ్చిన ఎన్నికల కోడ్ కారణంగా అప్పటి అధికారులు ఆ మిషన్ల పంపిణీని ఆపారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆయా కుట్టుమిషన్లను సదరు లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ.. ఆ మిషన్లకు కేసీఆర్ పేరు ఉండడం, వాటిపై కేసీఆర్ ఫొటో ఉండడం వంటి కారణాలతో కాంగ్రెస్ ప్రభుత్వం వాటి పంపిణీని నిలిపివేసింది. మైనార్టీ మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి ఉపాధి పొందేందుకు, మరికొందరికి ఉపాధి కల్పించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన గొప్ప పథకాన్ని నీరుగార్చింది. కేవలం కేసీఆర్ మీద ఉన్న కోపంతో ఆ మహిళల ఆశలపైనా నీళ్లు చల్లింది.
ఏడాదిగా మూలుగుతున్న మిషన్లు..
కేసీఆర్ తోఫా పేరిట వచ్చిన ఈ కుట్టుమిషన్లను రేవంత్రెడ్డి ప్రభుత్వం పంపిణీ చేయకపోవడంతో భద్రాచలం నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో అవి పేరుకుపోయాయి. భద్రాచలం ఎంపీడీవో కార్యాలయంలోనూ ఏడాదికాలంగా ఇవి మూలుగుతున్నాయి. అయితే, కేసీఆర్ మీద కోపంగా ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తమకు శాపంగా పరిణమించిందని పలువురు మైనార్టీ మహిళలు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గానికి 100 చొప్పున అప్పట్లోనే కుట్టుమిషన్లను మంజూరు చేయగా.. భద్రాచలంలో అర్హత పొందిన వారిలో కొంతమంది మైనార్టీ మహిళలు పంపిణీ చేశారని, ఎన్నికల నియమావళి కారణంగా మరికొందరికి పంపిణీ నిలిపివేశారని చెబుతున్నారు. ప్రజాపాలన అంటూ గొప్పగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. వాస్తవంలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. తమకు ఇంత వరకూ వాటిని పంపిణీ చేయకుండా, ఆర్థిక స్వావలంబనను తమ దరికి చేరనీయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడుతోందని దుయ్యబడుతున్నారు. కుట్టుమిషన్లతో స్వయం ఉపాధి పొందుతూ, మరికొందరికి ఉపాధి కల్పిస్తూ బతుకుదామనుకున్న తమను ఈ ప్రభుత్వం అగౌరవపరుస్తోందని ధ్వజమెత్తుతున్నారు.
ఆందోళనకు వెనుకాడం..
మైనార్టీలోని ఒంటరి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ తోఫా పేరుతో సరఫరా చేసిన కుట్టుమిషన్లను భద్రాద్రి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేయలేదు. ఎన్నికలకు ముందే కొన్నింటిని అప్పటి ప్రభుత్వం పంపిణీ చేసింది. తర్వాత వచ్చిన రేవంత్ ప్రభుత్వం మిగతా వాటిని మూలకుపడేసింది. వాటిని పంపిణీ చేయకపోతే ఆందోళనలకూ వెనుకాడం.
-జలాల్ అహ్మద్, సేవ్ కొత్తగూడెం కన్వీనర్, కొత్తగూడెం
వెంటనే పంపిణీ చేయాలి..
గత కేసీఆర్ ప్రభుత్వంలో మైనార్టీల్లోని ఒంటరి మహిళల కోసం తెచ్చిన కుట్టుమిషన్లను ఇప్పటి ప్రభుత్వం తక్షణమే పంపిణీ చేయాలి. వాటిని అందిస్తే తాము ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతాం. తోటి మహిళలకు ఉపాధినీ కల్పిస్తాం. వీటి పంపిణీ కోసం ఏడాదికాలంగా ఎదురుచూస్తున్నాం. ఇప్పటికే పంపిణీ చేసి మాకు ఉపాధి మార్గం చూపాలి.
-షేక్ ఫర్హీన్, మైనార్టీ మహిళ, భద్రాచలం