కూసుమంచి, అక్టోబర్ 28 : ఎగువన కురుస్తున్న వర్షాలతో పాలేరు జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుండడంతో పరవళ్లు తొక్కుతున్నది. అధికారులు అలుగుల వద్ద నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. 24 గేట్లకు గాను.. 18 గేట్ల నుంచి దిగువకు నీరు వెళ్తున్నది. పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం 22 అడుగుల వరకు వస్తే ఆటోమెటిక్ ఫాలింగ్ గేట్లు కావడంతో అవి పడిపోయి దిగువకు నీరు వెళ్తున్నది. మంగళవారం సాయంత్రానికి నీటిమట్టం 22.5 అడుగులకు చేరుకోగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు.
అయితే నాగార్జున సాగర్ నుంచి 1,798 క్యూసెక్కుల నీరు పాలేరు జలశయానికి వచ్చి చేరుతుండగా.. మంగళవారం సాయంత్రం 4 గంటలకు వరద ద్వారా 1,165 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. పాలేరు నుంచి అవుట్ ఫ్లోలో మిషన్ భగీరథకు 135 క్యూసెక్కులు, భక్తరామదాసు ఎత్తిపోతలకు 545 క్యూసెక్కులు, ఫాలింగ్ గేట్ల ద్వారా 1,375 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. ఇన్, ఔట్ ఫ్లోల మధ్య వ్యత్యాసం ఉండడం వల్ల క్రమంగా పాలేరు నీటిమట్టం పెరుగుతున్నది. పాలేరుకు ఎగువన ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరద కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో ఇరిగేషన్ ఎస్ఈ మంగలపుడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈఈ రమేశ్‌రెడ్డి, డీఈ రత్నకుమారి, అధికారులు అప్రమత్తమయ్యారు.