కారేపల్లి, అక్టోబర్ 14 : ఖమ్మం జిల్లాలోని 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.2.96 కోట్ల వ్యయంతో చిన్న, మధ్య తరహా మరమ్మతు పనులను చేపడుతున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి (డీఐఈఓ) కె.రవిబాబు తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నైజ్డ్ సైన్) ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం గతం కంటే పెరిగిందన్నారు. అదేవిధంగా హెచ్ఆర్ఎంఎస్, సీసీ కెమెరాలను అమర్చడం ద్వారా కళాశాల సిబ్బంది విధి నిర్వహణ పనితీరును రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖ సంచాలకులు కంట్రోల్ రూమ్ లో పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.
ప్రతి కళాశాలలో సైన్స్ గ్రూప్ విద్యార్థులకు ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఖాన్ అకాడమీ ద్వారా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు పై చదువులను ఏ విధంగా ఎంచుకుంటే ఏం ప్రయోజనం చేకూరుతుందనే అంశంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతి శనివారం క్రీడలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థులకు చదువుతో పాటు అదనపు యాక్టివిటీస్ ను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా కళాశాల భవనాల్లో నెలకొన్న వివిధ రకాల మరమ్మతు పనులను చేపడుతున్నట్లు వెల్లడించారు. అంతకుముందు కళాశాలలో జరుగుతున్న మరమ్మతు పనులను డీఐఈఓ పరిశీలించారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపాల్ విజయ కుమారి, అధ్యాపక సిబ్బంది ఉన్నారు.
Karepally : రూ.2,96 కోట్లతో ఖమ్మం ప్రభుత్వ కళాశాలలకు మరమ్మతులు : డీఐఈఓ రవిబాబు