బూర్గంపహాడ్, ఏప్రిల్ 19: మండుతున్న ఎండలో సైతం కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నారని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, ఎండీ యాకూబ్‌పాషా, బల్లెం నాగయ్య అన్నారు. అయినప్పటికీ, ఐటీసీ యాజమాన్యం కార్మికుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకపోవడం దారుణమని అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వేతన ఒప్పందాలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ఐటీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న రిలే దీక్షలు ఆదివారం 25వ రోజుకు చేరుకున్నాయి.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. కార్మికుల దీక్షలు 25వ రోజుకు చేరడంతో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్లు తెలిపారు. లేబర్ కమిషన్ ఆదేశించినా ఐటీసీ యాజమాన్యం కార్మిక సమస్యలను పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. యాజమాన్యం తన వైఖరి మార్చుకోకపోతే రానున్న రోజుల్లో కార్మికుల పోరాటం మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే సమ్మెకు సైతం వెనుకాడబోమని స్పష్టం చేశారు. జేఏసీతో చర్చలకు వచ్చి కార్మిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొండోజు కృష్ణమాచారి, నూనావత్ దూల్సింగ్, అరుణ, కస్తూరి , సర్వేశ్వరరావు, చుక్కపల్లి బాలాజీ, సమ్మక్క, బాబు తదితరులు పాల్గొన్నారు.