నమస్తే నెట్వర్క్ ;ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అరకొర వేతనాలతో నెట్టుకొస్తున్న వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపారు. వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడంతో వీఆర్ఏలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో రాష్ట్రంలోని 23 వేల మంది వీఆర్ఏలకు లబ్ధి చేకూరనున్నది. శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జై కేసీఆర్.. జై తెలంగాణ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. స్వీట్లు పంచి పెట్టుకొని సంబురాలు జరుపుకున్నారు. దశాబ్ది వేడుకల సందర్భంగా తమ కుటుంబాలకు శుభవార్త చెప్పడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ముక్తకంఠంతో పేర్కొంటున్నారు.
సీఎం కేసీఆర్ మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. మొన్న కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లను, నిన్న రాష్ట్రంలోని వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. అందుకు గురువారం మంత్రి వర్గ సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టారు. ఆ బిల్లును మంత్రివర్గం మొత్తం ఆమోదించింది. దీంతో వీఆర్ఏల ఎన్నో ఏళ్లనాటి కల ఫలించింది. గత పాలకుల హయాంలో ఉద్యోగ భద్రత లేక, అరకొర వేతనంతో జీవితాలను గడుపుతున్న వారి జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారు. గతేడాది అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు. జూన్ 2వ తేదీ నుంచి జరిగే దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేసి పలు శాఖల్లోకి మార్పు చేస్తామని ప్రకటించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంబురాలు అంబురాన్నంటాయి. తహసీల్దార్ కార్యాలయాల వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటాలకు ప్రజాప్రతినిధులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. జై కేసీఆర్.. జై తెలంగాణ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. స్వీట్లు పంచిపెట్టుకొని సంబురాలు జరుపుకున్నారు.
జీవితాంతం రుణపడి ఉంటాం..
ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెలంగాణ సర్కార్‌లో పరిష్కారం లభించింది. రెవెన్యూ శాఖలో అరకొర వేతనంతో ఉద్యోగ భద్రత లేకుండా విధులు నిర్వహిస్తున్న మాకు దారి దీపమయ్యారు సీఎం కేసీఆర్. నేను కొన్నేళ్లుగా వీఆర్ఏగా పని చేస్తున్నా. చాలీచాలని వేతనంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. గతేడాది అసెంబ్లీ సమావేశాలల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం క్యాబినెట్లో ఆమోదం లభించడం సంతోషంగా ఉంది. జీవితాంతం సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– అమరం రాము, వీఆర్ఏల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు