కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 11: కొత్తగూడెంలోని సింగరేణి సంస్థ ప్రధాన కార్యాలయంలో కాంట్రాక్టర్లు దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీలకశాఖల్లో అవసరం ఉన్నా లేకున్నా స్కిల్డ్ వర్కర్లను నియమిస్తూ లక్షలాది రూపాయలను దండుకుంటున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్లు కొన్నిశాఖల జీఎంలతో ములాఖత్ అయి కీలకశాఖల్లో కాంట్రాక్టు కార్మికులు, స్కిల్డ్వర్కర్లతో విధులు చేస్తున్నారు. దీంతో కాన్ఫిడెన్షియల్ విషయాలు బయటికి రావడంతో విజిలెన్స్ అధికారులు విచారించడం కూడా జరిగినట్లు తెలుస్తోంది. సింగరేణి హెడ్డాఫీస్లో కీలకశాఖలైన పర్సనల్ డిపార్ట్మెంట్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్, రిక్రూట్మెంట్ సెల్, ఈఈ సెల్, పీఎం వింగ్, ఐఆర్ వింగ్, సివిల్ డిపార్ట్మెంట్, ఎఫ్అండ్ఏ డిపార్ట్మెంట్, జీఎం పర్సనల్ ఐఆర్ అండ్ పీఎం శాఖల్లో కాంట్రాక్టు కార్మికులతో పనులు చేయిస్తున్నారు.
దీనివల్ల ట్రాన్స్ఫర్లు, వయస్సు, ఇతరత్రా ముఖ్యమైన లెటర్లు లీకవుతున్నట్లు, కొన్ని సమయాల్లో ఆ ఫైల్స్ కనపడకుండాపోయి ఒకట్రెండ్రోజుల తర్వాత దొరికినట్లు చేసి కాంట్రాక్టు కార్మికులు ఆయా కార్మికుల నుంచి డబ్బులు దండుకుంటున్నారని యూనియన్ నేతలు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు సైతం చేసిన ఘటనలు లేకపోలేదు. ఆయా విభాగాల్లో పర్మినెంట్ కార్మికులతో విధులు చేయించాలి.. కాంట్రాక్టు కార్మికులను కేటాయించినా 2, 3 నెలలకు ఒకసారి డిపార్ట్మెంట్ను మార్చాల్సి ఉంది. కానీ ఏళ్ల తరబడి ఒకే డిపార్ట్మెంట్లో విధులు నిర్వహించడం వల్ల చెప్పిన పనులు కూడా సక్రమంగా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కాంట్రాక్టు కార్మికులు ఆయా డిపార్ట్మెంట్ల అధికారులను మచ్చిక చేసుకొని వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను కాంట్రాక్టు కార్మికులు, స్కిల్డ్ వర్కర్లుగా ఉద్యోగాల్లో చేర్పించుకొని వారికి నచ్చిన అధికారులు, యూనియన్ నాయకులకు కావాల్సిన సమాచారాన్ని బయటికి లీక్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.