రైల్వే ద్వారా బొగ్గు రవాణాలో గత రికార్డులు బద్ధలు
2,344 రేకుల ద్వారా సరఫరా
సింగరేణికే ఆదర్శం ఈ ప్లాంట్
సీఎండీ శ్రీధర్ ప్రశంసలు
రామవరం, ఏప్రిల్ 16 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ఏరియా ఆర్సీహెచ్పీ (రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్) కొత్త రికార్డు నెలకొల్పింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రైల్వే ద్వారా బొగ్గు రవాణాలో తడాఖా చూపించింది. గత రికార్డును తానే బద్ధలు కొట్టి, సింగరేణిలోని 9 సీహెచ్పీల్లో ఎరుగని రవాణాతో సుస్థితర స్థానం సాధించింది. సింగరేణికే ఆదర్శంగా నిలుస్తూ.. చరిత్ర సృష్టిస్తున్నది. కొవిడ్ ప్రభావం ఉన్న సమయంలో కూడా అత్యధిక రేకుల ద్వారా బొగ్గు రవాణా చేసి, సంస్థ సీఎండీ ద్వారా ప్రశంసలు అందుకున్నది. నగదు ప్రోత్సాహకాలతో ముందుకుసాగుతున్నది.
సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని భూగర్భ గనులు, ఓసీల్లో ఉత్పత్తి చేసిన బొగ్గు ఆర్సీహెచ్పీకి బెల్ట్ ద్వారా సరఫరా అవుతుంది. అక్కడి నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా, రోడ్డు రవాణా ద్వారా వివిధ ప్రాంతాలకు తరలిస్తుంటారు. ఈ ఆర్థిక సంవత్సరం 2021-22 మార్చి 31వ తేదీ వరకు 2,344 రేకుల ద్వారా (59 వ్యాగన్లకు ఒక రేకు) 94,64,764.06 టన్నుల బొగ్గును రవాణా చేశారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మార్చి 31 నాటికి 92,94,224 టన్నుల బొగ్గు రవాణా చేసింది. కాగా, 2021-22 మార్చి 25 నాటికి (వారం రోజుల ముందుగానే) 92,94,888.87 లక్షల టన్నులు రవాణాచేసి గతంలో నెలకొల్పిన రికార్డును తిరగరాసింది. సింగరేణి వ్యాప్తంగా రైల్వే ద్వారా బొగ్గు రవాణాలో తన స్థానాన్ని సుస్థిరపర్చుకుంది. ఎవరికీ సాధ్యం కాని ఈ రికార్డును నెలకొల్పడంలో కార్మికులు, అధికారులు, సూపర్వైజర్లు, టెక్నీషియన్ సిబ్బంది డీఎల్ఆర్ కార్మికుల సమష్టి కృషితోనే రికార్డు సృష్టించడం సాధ్యమైందంటున్నారు.
సమష్టి కృషితోనే..
కార్మిక సోదరులు, టెక్నీషియన్ సిబ్బంది, సహచర ఉద్యోగులు, యూనియన్ నాయకుల సమష్టి కృషితోనే రవాణా సాధ్యమైంది. ఈ రికార్డు నెలకొల్పడంలో ఏరియా జీఎం సీహెచ్ నర్సింహారావు ప్రోత్సాహం మరువలేనిది. ఇదే స్ఫూర్తితో ముందుకుపోతూ రక్షణతో కూడిన రవాణా చేసి, సింగరేణి చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించేందుకు కృషి చేస్తాం.
– ఉయ్యూరు వెంకటేశ్వర్లు, డీవైజీఎం, ఆర్సీహెచ్పీ