ఖమ్మం, డిసెంబర్ 19 : ప్రైవేటు హాళ్లకు దీటుగా ఖమ్మం నగరంలోని భక్త రామరాసు కళాక్షేత్రాన్ని ఆధునీకరిస్తామని, ఇందుకోసం డీపీఆర్ తయారు చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రాన్ని గురువారం సందర్శించిన కలెక్టర్.. ప్రూఫ్ లీకేజీ మరమ్మతు, ఎంట్రీ కలర్ వాష్ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కళలు, కళాకారులకు పుట్టినిల్లు అయిన ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న భక్త రామదాసు కళాక్షేత్రంలో ఇంటీరియర్ మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సౌండ్, ఆడియో వ్యవస్థను మెరుగుపర్చడం, డయాస్, పూర్తిస్థాయిలో లైటింగ్, వాల్ పెయింటింగ్, సీటింగ్ అరెంజ్మెంట్స్, ఆవరణలో గ్రీనరీ కోసం హైదరాబాద్ నుంచి ఆరిటెక్చర్ను పిలిపించి డిజైన్ రూపొందించి డీపీఆర్ తయారు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జడ్పీ సీఈవో దీక్షా రైనా, డిప్యూటీ ఇంజినీర్ మహేశ్‌బాబు, సంబంధిత అధికారులు ఉన్నారు.