భద్రాచలం, ఫిబ్రవరి 16 : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం, సామగాన లహరి కల్చరల్ ట్రస్ట్, నేండ్రగంటి అలివేలు మంగ ఛారిటబుల్ ట్రస్ట్, శ్రీచక్రా సిమెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న భక్త రామదాసు 391వ జయంత్యుత్సవాలు శుక్రవారంతో ముగిశాయి.
జయంత్యుత్సవాల్లో పాల్గొన్న కళాకారులు తమ గాత్రంతో, సంగీత కచేరీలతో, వాయిద్య పరికరాలతో ఎంతో మంది సంగీతాభిమానులను మురిపించారు. సంగీతాభిమానులకు వీనుల విందైన అనుభూతి అందించారు. అలాగే భక్త రామదాసు, తూము నరసింహదాసు కీర్తనలు శ్రోతల మదిని దోచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దేవస్థానం అధికారులు ఐదు రోజులపాటు వివిధ కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించారు.