– మాజీ మంత్రి పువ్వాడ అజయ్
– పువ్వాడ పేరు లేకుండా చేయాలని ప్రయత్నాలు
ఖమ్మం, సెప్టెంబర్ 03 : కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసేందుకు ఆలోచిస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గురువారం వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ రైతు సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. రైతులను వంచించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఆరోపించారు. రైతు రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయకుండానే మంత్రులు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఏ గ్రామంలోనైనా వంద శాతం రుణమాఫీ చేసినట్లు మంత్రులు నిరూపించాలని సవాల్ చేశారు. రఘునాథపాలెం మండలంలో తాను సొంత నిధులతో నిర్మించిన రైతు వేదికకు తన సోదరుడు పువ్వాడ ఉదయ్ కుమార్ పేరును తొలగించేందుకు ప్రయత్నాలు జరిగాయన్నారు. ఖమ్మం జిల్లాలో ‘పువ్వాడ’ అనే పేరు లేకుండా చేయడమే వ్యవసాయ శాఖ మంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు.
ఉమ్మడి ప్రాజెక్టుల విషయంలో నీటి కేటాయింపులను తేల్చి, తెలంగాణకు దక్కాల్సిన సరైన వాటాలను పంపిణీ చేయకుండా రాష్ట్ర నీటి హక్కులను కాలరాస్తున్నారని తెలంగాణ నీటి హక్కులను హరిస్తున్న ఆంధ్రప్రదేశ్ పాలకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాంతానికి దక్కాల్సిన నీటిని అన్ని ప్రాజెక్టుల నుంచి సరైన విధంగా తరలించే ప్రక్రియ జరగడం లేదని అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీటిని తరలిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పాలకులు జల దోపిడీకి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు భూములు, ఇసుక, మట్టి దోపిడీలకు పాల్పడుతున్నారన్నారు. కాంట్రాక్టుల పేరుతో కమీషన్లు దండుకోవడమే పనిగా పెట్టుకున్నట్లు తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పనులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పారు. రాజీవ్ కెనాల్ పేరుతో చేపట్టిన పనులు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని పేర్కొన్నారు.