ఉమ్మడి జిల్లాలోని గ్రామసభల్లో చివరి రోజైన శుక్రవారం కూడా ఉద్రిక్తతలు, నిరసన జ్వాలలు కొనసాగాయి. ఇందిరమ్మ కమిటీల పేరుతో కాంగ్రెస్ నాయకులు తమ కార్యకర్తల పేర్లతో ఏకపక్షంగా జాబితాలు రూపొందించుకున్నారంటూ ప్రజలు ఆగ్రహించారు. ఖమ్మం రూరల్ మండలం పెద్దతండా ప్రజలు అధికారులపై తిరగబడ్డారు. పథకాల పేరిట ప్రభుత్వం తమను మోసం చేసిందంటూ ఆగ్రహించారు. ఏకంగా మైక్ అందుకొని మరీ కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు.
ఇదే సభలో మరికొందరు రైతులు రైతుభరోసా పథకంపైనా నిలదీశారు. గడిచిన సీజన్ల పెట్టుబడి సాయం ఎప్పుడిస్తారో చెప్పాలంటూ ప్రశ్నించారు. అశ్వారావుపేటలో ఓ అంధుడు అధికారులను నిలదీశాడు. సభావేదికపైకి చేరుకొని ‘ఇందిరమ్మ ఇంటికి నేను అర్హుడిని కాదా సారూ..’ అంటూ ప్రశ్నించాడు. దీంతో పోలీసులు అతడిని బలవంతంగా కిందకు దించేశారు. అదే సభలో మరికొందరు గ్రామస్తులు కూడా రేవంత్ సర్కారుపై భగ్గుమన్నారు. ‘స్థలమూ ఇవ్వదు. ఇల్లూ ఇవ్వదు. మాలాంటి నిరుపేదలకు ఈ ప్రభుత్వం ఇంకేమి ఇస్తుంది?’ అంటూ ప్రశ్నించారు. సారపాక గ్రామసభ కూడా రసాభాసగా మారింది. సాక్షాత్తూ ఐటీడీఏ పీవో సభ మొదలైన కొద్దిసేపటికే వెళ్లిపోయారు. జాబితాలో పేర్లు రాని అర్హులుంటే మరోసారి దరఖాస్తు చేసుకోవాలంటూ సూచించి వెనుదిరిగారు.
నాలుగు పథకాలకు అర్హులను ఎంపిక చేశామంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం.. నాలుగు రోజులపాటు నిర్వహించిన గ్రామసభల్లో ఆ అర్హుల జాబితాలను వెల్లడించింది. తీరా ఆయా జాబితాలను పరిశీలించుకున్న పేదలు.. వాటిల్లో తమ పేర్లే లేవంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. జాబితాల్లో ఒక్కరో ఇద్దరో అనర్హులుంటే గ్రామసభలన్నీ ప్రశాంతంగానే జరిగేవి. కానీ ఏకంగా నాలుగు రోజులుగా గ్రామాల్లో సభలు పెట్టి అర్హుల జాబితాలు ప్రకటించినా..
వాటిల్లో ఎక్కడా కూడా పథకాలకు తాము ఎంపికయ్యామంటూ పేదలు సంతోషంగా బయటికొచ్చిన దృశ్యాలు లేవంటే అతిశయోక్తి కాదు. అనర్హులను వడపోయాల్సిన జాబితాలు అర్హులను వడపోసినట్లుగా ఉండడంతో జనాలు ఆగ్రహించారు. పాల్వంచలో సభలు ముగిసినప్పటికీ దరఖాస్తులతో మున్సిపల్ కార్యాలయానికి ప్రజలు పోటెత్తారు. టేకులపల్లిలో అధికారులు చుట్టుముట్టడంతో పోలీసులు స్పందించి అధికారులను పంచాయతీ కార్యాలయంలోకి తీసుకెళ్లి తలుపులు వేసి తాళం వేశారు. ఇదే మండలంలోని గ్రామసభలో తనపై మహిళలు దాడి చేశారని, తన కంటికి గాయమైందని మహిళా కార్యదర్శి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన విధులకు గ్రామస్తులు ఆటంకం కలిగించారంటూ రఘునాథపాలెం మండలం బావోజీతండా కార్యదర్శి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్తగూడెం పట్టణంలో ప్రభుత్వోద్యోగి భర్తకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో పట్టణ ప్రజలు భగ్గుమన్నారు. అశ్వారావుపేటలో ఉదయం 8 గంటలకే గ్రామసభ ఉండడంతో గ్రామస్తులెవరూ హాజరుకాలేదు. సాక్షాత్తూ ఎమ్మెల్యే వచ్చినప్పటికీ ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. మొత్తంగా నాలుగు పథకాలు వస్తాయనుకుంటూ ఎంతో ఆశగా ఎదురుచూసిన పేదల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిలువునా నీళ్లు చల్లింది.
బూర్గంపహాడ్ మండల గ్రామసభలు కూడా ఉద్రిక్తంగా ముగిశాయి. సారపాక సభ ప్రారంభమయ్యాక జాబితాలోని పేర్లను అధికారులు చదువుతుండగా నిరుపేదలు అభ్యంతరం వ్యక్తం చేశారు. లిస్టులో అర్హుల పేర్లు కాకుండా అనర్హుల పేర్లే అధికంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. దీంతో స్పందించిన ఐటీడీఏ పీవో.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందుతాయని అన్నారు. జాబితాలో పేర్లులేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పి సభ నుంచి వెళ్లిపోయారు.
అనంతరం జాబితాలోని అనర్హుల పేర్లపై బీఆర్ఎస్ సహా వివిధ పార్టీల నాయకులు, ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ కమిటీల పేరుతో కాంగ్రెస్ వాళ్లే వారి కార్యకర్తల పేర్లతో జాబితాను నింపారంటూ బీజేపీ నాయకుడు ఏనుగుల వెంకటరెడ్డి నిలదీశారు. అర్హుల పేర్లు జాబితాలో లేవంటూ బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు అధికారులను నిలదీశారు. దీంతో ఎస్సై రాజేశ్ వారిని అడ్డుకున్నారు. చివరకు జాబితా చదవడం పూర్తయిందని, గ్రామసభ ముగిసిందని అధికారులు చెప్పడంలో అక్కడున్న ప్రజలు, సుందరయ్య కాలనీ మహిళలు, ఆయా పార్టీల నాయకులు పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
అశ్వారావుపేట గ్రామసభకు సాక్షాత్తూ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హాజరైనప్పటికీ గ్రామస్తులు రాకపోవడంతో అక్కడ ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. ఉదయం 8 గంటలకు గ్రామసభ నిర్వహించాల్సి ఉంది. అటు అధికారులుగానీ, ఇటు గ్రామస్తులుగానీ ఆ సమయానికి రాలేదు. అప్పటికే ఎమ్మెల్యే హాజరుకావడంతో వేదికపైన కొద్దిమంది అధికారులే ఉన్నారు.
సొంతిల్లులేక ఎన్నో ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నామని, అయితే డాబాలో అద్దెకున్నంతమాత్రాన ఇందిరమ్మ ఇళ్లకు ఎలా అనర్హులమవుతామని అశ్వారావుపేట మండల ప్రజలు ఆగ్రహించారు. ప్రజాప్రభుత్వమని, ఇందిరమ్మ రాజ్యమని నమ్మబలికిన రేవంత్ సర్కారు.. తమను నట్టేట ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో అంధుడైన అశ్వారావుపేట పాస్టర్ గోగాడ విజయకుమార్ ఆవేదనకు లోనయ్యారు. సభావేదిక పైకి చేరుకొని ‘నేను అర్హుడిని కాదా సారూ..’ అంటూ అధికారులను ప్రశ్నించారు. జాబితాలో పేదల పేర్లు లేకపోవడంతో ఇదే గ్రామసభలో బీఆర్ఎస్, సీపీఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
టేకులపల్లి మండల గ్రామసభల్లో ప్రజాగ్రహం పెల్లుబికింది. పథకాలన్నింటికీ ఏకపక్షంగా కాంగ్రెస్ వాళ్లనే ఎంపిక చేశారంటూ అధికారులను గ్రామస్తులు నిలదీశారు. టేకులపల్లి పంచాయతీలో ఎంపీడీవో రవీందర్రావు అర్హుల జాబితాను చదివి వినిపించారు. అందులో పేదల పేర్లు లేకపోవడంతో మహిళలు ఒక్కసారిగా సభా వేదికపైకి దూసుకొచ్చారు. పేర్లన్నీ కాంగ్రెస్ వాళ్లవే ఉన్నాయంటూ అధికారులను ప్రశ్నించారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొన్నది. అక్కడే ఉన్న సీఐ సురేశ్, ఎస్సై శ్రీకాంత్‌లు గ్రామస్తులను సముదాయించారు. అయినా వారు శాంతించకపోవడంతో అధికారులను పంచాయతీ కార్యాలయంలోకి తీసుకెళ్లి తలుపులు పెట్టారు.