ఖమ్మం రూరల్, మార్చి 18 : వరి పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి క్వింటాకు ఇస్తానన్న 500 రూపాయల బోనస్ ఇంతవరకు చెల్లించలేదని, వెంటనే ఆ డబ్బులు చెల్లించాలని సీపీఎం ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి ఉరడి సుదర్శన్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు నండ్ర ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని కాచిరాజు గూడెం, కస్నాతండా, వాల్యాతండా, రేగులతండా గ్రామాల్లోని రైతులు కాచిరాజుగూడెంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో అమ్మిన వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో కాచిరాజు గూడెంలో గల రైతు వేదిక వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మిర్చి పంటకు క్వింటాకు రూ.25 వేలు మద్దతు ధర ఇవ్వాలని, అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతు సంక్షేమమే తమ ధ్యేయమని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతును నట్టేట ముంచుతుందని విమర్శించారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే తెలంగాణ రైతు సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో మంత్రుల ఇండ్లు, ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఏఈఓ నజ్మాకు అందజేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు నందిగామ కృష్ణ, పొన్నెకంటి సంగయ్య, భూక్య నాగేశ్వరరావు, వడ్లమూడి నాగేశ్వరరావు, పొన్నం వెంకటరమణ, కారుమంచి గురవయ్య, పొన్నం మురళి, భాస్కర్ రావు, ఊరుబండి చంద్రయ్య, ధరావత్ తారాచంద్, వెంకన్న పాల్గొన్నారు.
CPM : వరి బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని నిరసన