సత్తుపల్లి రూరల్, మార్చి 22: మండలంలోని కిష్టాపురంలోని ఓ నగల దుకాణంలోకి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి రూ.9 లక్షల విలువైన ఆభరాణాలను అపహరించిన సంగతి విదితమే. చోరీపై బాధితులు సత్తుపల్లి పోలీసులను ఆశ్రయించగా వారు వారంరోజుల్లో కేసును ఛేదించారు. చోరీ సొత్తు మొత్తాన్ని రికవరీ చేశారు. పట్టణ సీఐ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 15న కిష్టాపురంలోని ఓ నగల దుకాణ తాళాలు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. రూ.9లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు కొంత నగదును అపహరించి ఉడాయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు.. ఎస్సై షాకీర్, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ విషయం బయటకు వచ్చింది. వారి నుంచి 11 తులాల బంగారం, 7.5 కిలోల వెండి ఆభరణాలతో పాటు రూ.3 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలంలోని నాచారానికి చెందిన చేపలమడుగు నాగసురేశ్, వేముల జగదీశ్‌గా గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. గతంలో వీరు వేంసూరు మండలంలోని మర్లపాడులోని మొబైల్ దుకాణంలో చోరీకి పాల్పడ్డారని, ఏపీలోని చింతలపూడిలో అనేక చోరీలకు పాల్పడినట్లు సీఐ తెలిపారు. కేసును ఛేదించేందుకు శ్రమించిన ఎస్సై షాకీర్, ఏఎస్సై బాలస్వామి, సిబ్బంది శ్రీనివాసరావు, లక్ష్మణ్, నరేశ్‌ను అభినందించారు.