మామిళ్లగూడెం, నవంబర్ 1: అపరిష్కృతంగా ఉన్న హోంగార్డు ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ అన్నారు. నగరంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కల్యాణ మండపంలో హోంగార్డు ఆఫీసర్ల శాఖాపరమైన సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు శుక్రవారం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారినుద్దేశించి సీపీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న హోంగార్డు ఆఫీసర్ల సమస్యలు తన పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరిస్తానని, ప్రభుత్వపరంగా ఉంటే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. విధి నిర్వహణలో పోలీసులకు సహాయకారిగా ఉండే హోంగార్డు ఆఫీసర్లకు వ్యక్తిగత క్రమశిక్షణ, సమయపాలన చాలా ముఖ్యమన్నారు. హోంగార్డులు తమ దృష్టికి తీసుకొచ్చిన ఆసుపత్రి ట్రీట్మెంట్లో రాయితీ, పిల్లల కళాశాలల ఫీజులో రాయితీ కోసం సంబంధిత యాజమాన్యంతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
క్రమశిక్షణ కలిగిన పోలీస్ శాఖలో విధి నిర్వహణలో నిబంధనలు అతిక్రమించొద్దని ఆయన సూచించారు. అనంతరం హోంగార్డు ఆఫీసర్ల విశ్రాంతి కోసం నిర్మిస్తున్న బ్యారక్‌ను సందర్శించి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం హోంగార్డు ఆఫీసర్లు తమ సమస్యలతో కూడిన వినతిపత్రం సీపీకి అందజేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీపీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. అడిషనల్ డీసీపీ (లా అండ్ ఆర్డర్) ప్రసాద్‌రావు, ఎస్బీ ఏసీపీ సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.