మామిళ్లగూడెం, డిసెంబర్ 6 : పోలీస్ శాఖలో హోంగార్డుల సేవలు ఎంతో కీలకమని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ అన్నారు. 62వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని సిటీ పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సీపీ ముందుగా సాయుధ హోంగార్డు ప్లాటూన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఇనపనూరి వెంకటేశ్వర్లు పరేడ్ కమాండర్‌గా వ్యవహరించిన పరేడ్‌ను సీపీ పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు ఆఫీసర్స్ సేవలు అమోఘమన్నారు. ఇటీవల భారీ వర్షాలు, వరదల సమయంలో అంకితభావంతో విధులు నిర్వర్తించారని అభినందించారు. శాంతిభద్రతలు, ప్రజలకు రక్షణ కల్పించడంలో బాధ్యతాయుతమైన సేవలు అందించడంతోపాటు తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలలో ఎన్నికల బందోబస్తులో అప్పగించిన బాధ్యతలు నిబద్ధతతో నిర్వహించారని కొనియాడారు.
హోంగార్డుల సంక్షేమానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అనంతరం హోంగార్డుల స్పోర్ట్స్ మీట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ నరేశ్‌కుమార్, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్‌రావు, ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఏసీపీ సాంబరాజు, ఏఆర్ ఏసీపీలు సుశీల్‌సింగ్, నర్సయ్య, హోంగార్డు ఆర్ఐ సురేశ్, శ్రీశైలం, అప్పలనాయుడు పాల్గొన్నారు.