కారేపల్లి : కారేపల్లి మండలంలో గొర్రెలు, మేకలు, కోళ్లను దొంగిలిస్తున్న వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కొన్నరోజులుగా గొర్రెల కాపరులకు, జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దొంగలను పట్టుకొని.. వాళ్ల నుంచి సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. దొంగల అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను కారేపల్లిలో సీఐ తిరుపతిరెడ్డి విలేకరులకు వెల్లడించారు. కారేపల్లి ఎస్సై బైరు గోపి ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఉసిరికాయలపల్లి సింగరేణి ఓసి మూలమలుపు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలోనే ఇల్లందు ఓసీ గుట్ట నుండి ఒక ఆటో, రెండు బైకుల మీద కొందరు వచ్చారు. వాళ్లను ఆపి .. తనిఖీ చేయగా ఆటోలో ఒక గొర్రె పొట్టేలు ఉన్నది.
మండలంలో జరుగుతున్న గొర్రెలు, మేకల చోరీకి పాల్పడ్డారేమోననే అనుమానంతో వారిని పోలీసులు విచారించారు. దాంతో, దూడిమెట్ల శివయ్య, ఎల్లబోయిన సురేష్, ఎల్లవుల గోపి, జంగిడి ప్రకాష్ తామే దొంగతనం చేశామని అంగీకరించారు. ఈ నలుగురు కలిసి గత కొద్ది రోజుల నుండి ఉసిరికాయలపల్లి, సీతారాంపురం, శాంతినగర్ గ్రామాలలో చుట్టుపక్కల ప్రాంతాలలో మేక పోతులు, గొర్రెలు, పొట్టేళ్లు, కోళ్లు లను ఎత్తుకెళ్తున్నారు.
అనంతరం వాటిని ఇల్లందు, టేకులపల్లి ఏరియాలో గుర్తు తెలియని వ్యక్తులకు అమ్ముతున్నామని పోలీసులకు తెలిపారు. పొట్టేలును అమ్మడానికి తీసుకెళ్తుండగా దొరికిపోయినట్టు వాళ్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుండి 4 కేసులకు సంబంధించిన ప్రాపర్టీతో పాటు ఆటో, రెండు మోటార్ సైకిళ్లు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీఐ తిరుపతిరెడ్డి తెలిపారు. నిందితులను రిమాండ్ నిమిత్తం జ్యుడీషియ కస్టడీకి తరలించినట్లు ఆయ చెప్పారు.