భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : సాంప్రదాయ కుల, చేతివృత్తుల వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు పీఎం విశ్వకర్మ యోజన(పీఎంవీవై) ఉపయోగపడుతుందని, దీనిని ఆయా వృత్తులవారు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన అవగాహన సదస్సును ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయా వృత్తుల వారు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. జిల్లా పరిశ్రమల అధికారి సీతారాం మాట్లాడుతూ కుమ్మరి, కమ్మరి, మంగలి, వడ్రంగి, రజక, వడ్డెర, కంసాలి, దర్జీ వంటి చేతి వృత్తులపై ఆధారపడి జీవించే వారంతా ఈ పథకం కింద ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులన్నారు.
జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సంజీవరావు మాట్లాడుతూ ఈ పథకం కింద మొదటి విడత రూ.లక్ష రుణం మంజూరు చేస్తారని, నిర్ణీత వ్యవధిలో చెల్లించిన వారికి తిరిగి రూ.2 లక్షల రుణం మంజూరు చేస్తారని పేర్కొన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ కే.శివరామప్రసాద్.. పథకంపై వివరణాత్మక ప్రదర్శనను అందించారు. స్కీంలో నమోదు చేసుకోవడానికి దశలవారీ విధానంపై వివరించారు. కాగా.. అవగాహన సదస్సుకు 300 మంది హాజరయ్యారు. సమావేశంలో లాలానగర్ డీఎఫ్వో శివకుమార్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిర, లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంరెడ్డి, స్టీరింగ్ కమిటీ మెంబర్ ఆకుల నాగేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.