భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 16 (నమస్తే తెలంగాణ): పట్టణాల్లో జీవనం సాగిస్తున్న కుటుంబాలకు సంక్రాంతి పండుగ తీపిగురుతులు మిగిల్చింది. ఎన్నో అనుభూతులు, మధురస్మృతులు, పాతస్నేహాలతో గడిపిన క్షణాలు మనసునిండా నింపుకున్నారు. పండుగలో బంధువులు, స్నేహితులతో తెగ ఎంజాయ్ చేశారు. మూడ్రోజులపాటు ఆనందంగా గడిపిన పట్నంవాసులు తమ సొంతూళ్లను భారంతో వీడారు. గురువారం సంక్రాంతి సెలవులు ముగియడంతో పల్లెలను వదిలి పట్నాలకు తిరిగి పయనమయ్యారు. పాతస్నేహాలు, పల్లె వాతావరణాన్ని వదిలి జనం దీనంగా పల్లెలను వదిలివెళ్లారు. పల్లెలను వదలలేక మౌనంగా తిరుగు పయనమయ్యారు. ఒకరిఇంట్లో ఒకరు భోజనాలు చేసుకుని పాత సంగతులను గుర్తుచేసుకుని చిన్నప్పటి చదువులు, ఆటలు, ఆటవిడుపులు చేసుకున్న సంఘటనలు పల్లెల్లో దర్శనమిచ్చాయి. ఇలాంటి మధుర జ్ఞాపకాలను విడిచి బాధతోనే పట్నం ప్రయాణమయ్యారు.
కిక్కిరిసిన బస్టాండ్లు..
మూడ్రోజుల క్రితం పట్నాల నుంచి పల్లెలకు వచ్చిన జనం తిరిగి పట్నాలకు పయనమయ్యారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. చాలామందికి బస్సులు దొరకక ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. సొంత వాహనాలు ఉన్న వాళ్లు ఫోర్వీలర్స్, టూవీలర్స్, టాటా ఏసీఈ, టాటా మ్యాజిక్ల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ బస్టాండుల్లో ప్రయాణికులకు బస్సులు దొరకక నానా ఇబ్బందులు పడ్డారు.
పాపికొండల వద్ద సందడి..
సంక్రాంతి పండుగకు పల్లెలకు వచ్చిన ప్రజలు పాపికొండల విహారంలో తెగ సందడి చేశారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన కుటుంబాలు ఆంధ్రాలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న పాపికొండలను సందర్శించారు. కొంతమందికి లాంచీ టికెట్లు దొరకక దట్టమైన అడవుల్లోకి వెళ్లి వనభోజనాలు వండుకుని ఎంజాయ్ చేశారు. ప్రతిరోజు 20 నుంచి 30 లాంచీలు విహారయాత్రకు పయనమయ్యాయి. తిరుగు ప్రయాణంలో భద్రాచలం నుంచి ఇతర జిల్లాలో ప్రయాణికుల రద్దీ బాగా కనబడింది.