ఖమ్మం, జూన్ 25: లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)కు ప్లాట్ల యజమానుల నుంచి పెద్దగా స్పందన రావట్లేదు. అనధికార లే అవుట్లలోని స్థలాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 25 శాతం రాయితీ గడువును ఐదుసార్లు పెంచినా అనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు సకాలంలో ఫీజు చెల్లించకపోవడంతో ప్రభుత్వం గడువును పొడిగిస్తూ వచ్చింది. అయినా ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు. ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగిస్తూ అదే చివరిసారిగా పేరొంది. అనుకున్న స్థాయిలో ముందుకు రాకపోవడంతో మే 31 వరకు పొడిగించారు. సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో ఇబ్బందులు రావడంతో మళ్లీ జూన్ 30 వరకు అవకాశం ఇచ్చారు. ఈ గడువులోపైనా దరఖాస్తుదారులు ముందుకు వస్తారా? లేదా? అనేది వేచిడాల్సిందే..
ఖమ్మం జిల్లాలో ఖమ్మం కార్పొరేషన్‌తోపాటు సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులాపురం మున్సిపాలిటీలు ఉండగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ, కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట, మణుగూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 77,183 మంది దరఖాస్తులు చేసుకోగా.. 21,044 మందిని అర్హులుగా గుర్తించి ఫీజు చెల్లించాలని అధికారులు నోటీసులు ఇచ్చారు.
కానీ.. 3,596 మంది మాత్రమే రూ.96.05 కోట్లను ప్రభుత్వానికి చెల్లించారు. ఖమ్మం కార్పొరేషన్లోనే అత్యధికంగా 4,303 మంది రూ.59.99 కోట్లను చెల్లించగా.. ఇల్లెందు, మణుగూరు మున్సిపాలిటీల నుంచి ఒక్కరు కూడా ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లించలేదు. కొత్తగూడెం, అశ్వారావుపేట మున్సిపాలిటీలోని ప్లాట్ల యజమానులు సైతం ఎల్ఆర్ఎస్ పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అధికారుల మధ్య సమన్వయలోపం, దరఖాస్తుదారులను ప్రోత్సహించకపోవడంతో ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిషరించడానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. అయితే సర్వర్లు బిజీగా ఉండడం, ఆన్లైన్ ప్రక్రియ ముందుకు సాగకపోవడం వంటి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. మరోవైపు దరఖాస్తుదారులకు నేరుగా ఆటో జనరేట్ మెసేజ్‌లు వెళ్లకపోవడం, సర్వర్లు మొరాయించడం, వెబ్సైట్లో డాక్యుమెంట్లు అప్లోడ్ కాకపోవడం, ప్లాట్ల వివరాల్లో లోపాలు ఉండటం వంటి ఇబ్బందులను దరఖాస్తుదారులు ఎదురొంటున్నారు. దీంతో ఎల్-1 దశలోనే దరఖాస్తులకు బ్రేక్‌లు పడుతున్నాయి. దరఖాస్తులను పరిష్కరించే విషయంలో బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు( ఎల్-1) స్థలం దగ్గరకు వెళ్లి యాప్‌లో ఆ వివరాలను నమోదు చేయాలి. ఫీజు కట్టిన తర్వాత ఎల్-1 అధికారి మళ్లీ అప్లోడ్ చేస్తే టీపీవో (ఎల్-2) అధికారి దానిని పరిశీలించి అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత కమిషనర్ (ఎల్-3) లాగిన్‌కు వెళ్తుంది. దానిని ఓకే చేస్తే ప్రొసీడింగ్స్ వస్తాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక కార్పొరేషన్‌తోపాటు 9 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఖమ్మం కార్పొరేషన్లో 40,175 దరఖాస్తులు రాగా.. 12,067 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో 4,303 మంది రూ.56.99 కోట్ల ఫీజు చెల్లించారు. ఇంకా 8,098 మందికి ప్రొసీడింగ్స్ ఇవ్వాల్సి ఉంది. ఏదులాపురం మున్సిపాలిటీలో మొత్తం దరఖాస్తులు 13,618 రాగా.. 3,685 మంది అర్హులు కాగా.. వీరిలో 504 మంది రూ.12.87 కోట్ల ఫీజు చెల్లించారు. మధిర మున్సిపాలిటీలో 4,306 దరఖాస్తులు రాగా.. 1,086 అర్హులు కాగా.. 881 మంది రూ.4.78 కోట్ల ఫీజు చెల్లించారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో 658 దరఖాస్తులు రాగా.. 595 మంది అర్హులు కాగా.. 197 మంది రూ.1.21 కోట్ల ఫీజు చెల్లించారు.
సత్తుపల్లి మున్సిపాలిటీలో 3,695 దరఖాస్తులు రాగా.. 647 మంది అర్హులు కాగా.. 74 మంది రూ.1.64 కోట్ల ఫీజు చెల్లించారు. పాల్వంచ మున్సిపాలిటీలో 8,826 దరఖాస్తులు రాగా.. 2,103 మందిని అధికారులు అర్హులుగా గుర్తించగా.. 967 మంది రూ.11.59 కోట్ల ఫీజు చెల్లించారు. అశ్వారావుపేట మున్సిపాలిటీలో 2,344 దరఖాస్తులు రాగా.. 503 మంది అర్హులు కాగా.. 74 మంది రూ.1.64 కోట్ల ఫీజు చెల్లించారు. వైరా మున్సిపాలిటీలో 3,535 దరఖాస్తులు రాగా.. 727 అర్హులు కాగా.. 501 మంది రూ.2.33 కోట్ల ఫీజు చెల్లించారు. ఇల్లెందు మున్సిపాలిటీలో 26 దరఖాస్తులు రాగా.. వీటిలో ఎల్ఆర్ఎస్కు అర్హత కలిగినవి ఏమీ లేవు. మణుగూరు మున్సిపాలిటీలో ఎల్ఆర్ఎస్కు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం.
మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో అక్రమ లేఅవుట్లు, రిజిస్ట్రేషన్లు లేని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు సెప్టెంబర్ 1, 2020న బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 26 ఆగస్టు 2020లోపు సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసిన లే అవుట్ల యజమానులు, ప్లాట్ల ఓనర్లకు ఎల్ఆర్ఎస్కు అవకాశం కల్పించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఇళ్లు నిర్మించుకొని ఇంటి పన్నులు చెల్లించి క్రయవిక్రయాలు జరిపిన వారు కూడా ఎల్ఆర్ఎస్ చెల్లించాల్సి ఉంది. లేనిపక్షంలో క్రయవిక్రయాలు జరిపే అవకాశం ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయడానికి నిర్ణయించారు. తాజాగా జూన్ 30వ తేదీలోపు 25 శాతం ఫీజు రాయితీతో గడువు పొడిగించింది. అయినా ప్లాట్ల యజమానుల నుంచి స్పందన కరువైంది.
ప్లాట్ల యజమానులు ముందుకు రాకపోవడానికి అనేక సమస్యలు ఉన్నాయి. 2020లో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నప్పుడు ప్లాట్ విస్తీర్ణం ఎక్కువగా ఉండటం, దానిలో కొంత భాగాన్ని ఇతరులకు విక్రయించగా ఇప్పుడు మిగిలినదానికి మాత్రమే దరఖాస్తు చేసుకోగా ఆన్లైన్లో మొత్తం ప్లాట్ విస్తీర్ణం చూపిస్తున్నది. ఇలాంటివే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఖమ్మం నగరంలో చెరువులు, మున్నేరు వద్ద ఎఫ్టీఎల్ సమస్యలు ఉన్నాయి. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల సమన్వయలోపం, మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం, మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ విడుదల కాకపోవడం లాంటి అనేక సమస్యల కారణంగా ఎల్ఆర్ఎస్కు యజమానులు ముందుకురావడం లేదని అధికారులు అభిప్రాయ పడుతున్నారు.