మధిర, నవంబర్ 06 : డబ్బులు లేక రోజులుగా ఆకలితో అలమటిస్తూ నీరసించిన ఓ ప్రయాణికుడు స్పృహ కోల్పోయిన సంఘటన బుధవారం మధిరలో జరిగింది. మధిర రైల్వే స్టేషన్ పోలీస్ ఔట్ పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ గోపాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయి నుండి భువనేశ్వర్ వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్ద భయాలు గ్రామానికి చెందిన కీముడు జీవన్ కుమార్, కుర్ర లోకేశ్ కుమార్ రైల్లో విశాఖపట్నం వెళ్లేందుకు బయల్దేరారు. వీరిలో కీముడు జీవన్ కుమార్ రైలు కంపార్ట్మెంట్ ఎంట్రన్స్ వద్ద పడిపోయి ఉన్నాడు.
గమనించిన ప్రయాణికులు రైలు మధిర రైల్వే స్టేషన్కు చేరుకోగానే పోలీసులకు తెలిపారు. వెంటనే హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్ రెడ్డి తన సిబ్బందితో పాటు ఆర్కే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు రామకృష్ణతో రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. జీవన్కుమార్ను 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తామిద్దరం కూలి పనుల కోసం వెళ్లినట్లు కుర్రా లోకేశ్ తెలిపాడు. ఇద్దరూ రెండు రోజులుగా ఏం తినకపోవడంతో స్పృహ కోయినట్లు హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.