ఖమ్మం రూరల్, నవంబర్ 28 : ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ఆదేశాలతో తాసీల్దార్ రాంప్రసాద్ మూడు రోజుల్లో ఎన్నారై కు పాస్ బుక్స్ జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్డుకు చెందిన పసుపులేటి రాజగోపాల్ అమెరికాలో స్థిరపడ్డాడు. ఇతనికి ఏదులాపురం రెవెన్యూలోని సర్వే నంబర్ 19లో గుంట, సర్వే నంబర్ 20లో 31 గుంటలు, సర్వే నంబర్ 327లో 20 గుంటల భూమి ఉంది. దీనికోసం తను ఎన్నారై పోర్టల్ నుంచి 2022లో దరఖాస్తు చేసుకున్నాడు. కానీ దీనిపై అధికారుల స్పందన లేకపోవడంతో అది అలాగే తాసీల్దార్ లాగిన్‌లో ఉండిపోయింది. ఈ నేపథ్యంలో సదరు ఎన్నారై జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిసెట్టికి వాట్సాప్ ద్వారా తన పరిస్థితిని విన్నవించాడు.
తక్షణమే స్పందించిన కలెక్టర్ రాంప్రసాద్ కు సమాచారం అందించారు. దీనిని తన లాగిన్ లో పరిశీలించిన తాసీల్దార్ అప్లికేషన్లో ఉన్న సమస్యలను సదరు ఎన్నారైతో చర్చించారు. అలాగే ఇక్కడి వారి కుటుంబ సభ్యుడైన వెంపటి సురేందర్ ద్వారా పత్రాలను తెప్పించుకుని పూర్తిస్థాయిలో పరిశీలన చేసి పాస్ బుక్స్ జారీ చేశారు. ఆ భూమికి సంబంధించిన పత్రాలను శుక్రవారం తన కార్యాలయంలో సురేందర్‌కు అందజేశారు. కాగా పాస్ బుక్ జారీ కావడం పట్ల ఎన్ఆర్ఐ పసుపులేటి రాజగోపాల్ జిల్లా కలెక్టర్, తాసీల్దార్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. సుమారు మూడు సంవత్సరాల పైబడి ఉన్న సమస్య పరిష్కారం కావడం పట్ల అతడు హర్షం వ్యక్తం చేశాడు.