పినపాక, జనవరి 1: నాయకులు, కార్యకర్తలు పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేస్తూ.. ఐక్యతతో ముందుకెళితే ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు మనదే అవుతుందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. మండలంలోని ఈ బయ్యారం క్రాస్‌రోడ్‌లో బీఆర్ఎస్ మండల నూతన కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పాలకులు.. ఇప్పుడు వాటిని అమలు చేయలేక నానా తంటాలు పడుతున్నారని విమర్శించారు.
ఏడాది కాలంలోనే రేవంత్‌రెడ్డి సర్కారుపై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని అన్నారు. మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ నుంచి అశ్వారావుపేట వరకు గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములు నాలుగున్నర లక్షల ఎకరాలకు పట్టాలిచ్చిన ఘనత గత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని గుర్తుచేశారు. పినపాక నియోజకవర్గంలో 56 వేల మంది పోడు భూములకు పట్టాలు అందించానని జ్ఞప్తికి తెచ్చారు.
ఎన్నికల హామీలను అమలు చేయాలంటూ ప్రజల తరఫున బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వారిపై అక్రమ కేసులు పెడుతున్నదని ఆరోపించారు. త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులంతా ఐక్యతతో పనిచేసి పార్టీ బలపర్చిన అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు పగడాల సతీశ్‌రెడ్డి, వర్మ, భవానీ శంకర్, పొనుగోటి భద్రయ్య, వాసుబాబు, కొండేరు రాము, సత్తిబాబు, వెంకటరెడ్డి, యగ్గడి శ్రీరాం, మణుగూరు, అశ్వాపురం మండలాల నాయకులు పాల్గొన్నారు.