నింగికేగిన వనప్రేమికుడు
పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించాడు. దీనికి పచ్చని మొక్కలతోనే పరిష్కారం లభిస్తుందని నిర్ణయించుకున్నాడు. మొక్కకు విత్తే ప్రధానమని భావించాడు. ఎండిన గింజలను భారీ వృక్షాల కింద పొద్దంతా కూర్చొని సేకరిస్తూ.. పోగుచేస్తూ వాటిని రహదారులు, ఖాళీ ప్రదేశాల్లో నాటడమే పనిగా పెట్టుకున్నాడు. విత్తడమే కాదు.. ఆ విత్తనానికి రోజూ నీరందిస్తూ కంటికిరెప్పలా కాపాడుకున్నాడు. ఆ విత్తనం మొలకెత్తిందే తడవుగా పురిట్లో బిడ్డను సాకినట్లుగా సాకాడు.. మొక్క ఏపుగా ఎదుగుతున్నకొద్దీ మురిసిపోయాడు.
వాటికి రక్షణ కవచాలు ఏర్పాటు చేశాడు. అవి పచ్చదనాన్ని పంచుతూ.. బాటసారులకు నీడనిస్తుంటే మురిసిపోయాడు. ప్రజలు చెట్ల కింద సేదతీరుతుంటే తానే గొడుగు పట్టినట్లు భావించాడు. ఇలా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కోటికిపైగా మొక్కలు నాటి.. వాటిని మహావృక్షాలను చేసి ‘వనజీవి’ అయ్యాడు. ఆయన కష్టానికి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో సత్కరించింది. ఆ అవార్డుతో ఆగి పోకుండా వయసు మీదపడినా మరింత ఉత్సాహంతో ప్రాణమున్నంత వరకు మొక్కలకు ప్రాణం పోయడమే తన పనిఅంటూ బాటసారిలా సాగిపోతున్నాడు. ఆయన తుదిశ్వాస విడిచివెళ్లడంతో ఆక్సిజన్ ఆగిపోయినంత పని అయ్యింది. ఇక తమకు దిక్కెవరని ఆయన నాటిన మొక్కలన్నీ కన్నీరు కారుస్తున్నాయి. మళ్లీ రావయ్యా.. రామయ్య అంటూ పిలుస్తున్నాయి.
– ఖమ్మం రూరల్, ఏప్రిల్ 12
పచ్చదనమే ప్రాణంగా.. మొక్కలను నాటి పెంచడమే తన జీవిత ఆశయంగా పెట్టుకొని కడవరకు వృక్షోరక్షతి రక్షితః అని నినదించిన హరిత ప్రేమికుడు పద్మశ్రీ దరిపెల్లి రామయ్య(వనజీవి రామయ్య)(87) శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఖమ్మంజిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య మృతితో ఉమ్మడి ఖమ్మంజిల్లా ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు.
మరణానికి ఒక్కరోజు ముందు సైతం తన దైనందిన కార్యక్రమంలో భాగంగా విత్తనాలు సేకరించి ఇంటికివచ్చిన రామయ్య తన స్వగృహంలో రాత్రివేళ భోజనం చేసి పడుకున్నారు. నిత్యం తెల్లవారుజామున ఐదుగంటలకు లేచే అలవాటు ఉన్న రామయ్య లేవకపోయేసరికి అతని భార్య జానకమ్మ అనుమానంతో దగ్గరికి వెళ్లి చూడగా నిస్సహాయస్థితిలో ఉన్నాడు. దీంతో ఇంటిపక్కన వాళ్ల సహాయంతో హుటాహుటిన ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరలించారు.
రామయ్యను పరిశీలించిన వైద్యులు గుండెపోటుతో అప్పటికే మృతిచెందినట్లు తేల్చారు. రామయ్య భౌతికకాయాన్ని తిరిగి రెడ్డిపల్లి గ్రామంలో ఉన్న తన ఇంటికి కుటుంబ సభ్యులు తరలించారు. పచ్చటి చెట్టు ప్రాణం విడిచింది అనే వార్తలు ఒక్కసారిగా సోషల్‌మీడియా, మీడియా ప్రచార సాధనాల ద్వారా విషయం తెలుసుకున్న ఉమ్మడి ఖమ్మంజిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు.
ఒక్కటికాదు.. రెండుకాదు ఏకంగా 50యేండ్ల నుంచి మొక్కల పెంపకం చేపట్టి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న రామయ్య మరణవార్తతో ఆయన అభిమానులు, ప్రకృతి ప్రేమికులు భావోద్వేగానికి లోనయ్యారు. వనజీవిని కడసారి చూసేందుకు అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు పెద్దఎత్తున రెడ్డిపల్లికి క్యూ కట్టారు. భౌతికకాయాన్ని సందర్శించి ఘనంగా నివాళ్లు అర్పించారు. రామయ్య మనుమలు ఇతర రాష్ర్టాల్లో ఉన్నందున వారిరాక అనంతరం ఆదివారం రెడ్డిపల్లి గ్రామంలో అంత్యక్రియలు జరుగనున్నాయి.
రామయ్య కుటుంబ నేపథ్యం..
మధ్యతరగతికి చెందిన దరిపెల్లి లాలయ్య-పుల్లమ్మ దంపతులకు 1937 జూలై 1వ తేదీన రామయ్య జన్మించారు. 87 ఏండ్ల వయస్సు కలిగిన రామయ్య సుమారు 50 ఏళ్లుగా విత్తనాలు సేకరించడం, మొక్కలను పెంచడమే వృత్తిగా పెట్టుకొని జీవన ప్రయాణం సాగిస్తున్నారు. రామయ్య-జానకమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో ఇద్దరు కుమారులు చనిపోయారు.
ఇంట్లో అనేక విషాదకరమైన సంఘటనలు చోటుచేసుకున్నప్పటికీ మొక్కవోని దీక్షతో ఒక్కటి కాదు.. రెండు కాదు ఏకంగా కోటి మొక్కలు నాటి వనజీవి యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచారు. దీంతో రామయ్య కృషికి ఫిదా అయిన కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఖమ్మంరూరల్ మండలంలో ప్రధాన రహదారుల వెంట ఉన్న ఏ చెట్టును చూసినా వనజీవి రామయ్య గుర్తుకు వస్తాడు అని చెప్పడంలో ఎంతమాత్రం సందేహం లేదు.
ఆరునెలల క్రితం ఖమ్మం-మహబూబాబాద్ ప్రధాన జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా రామయ్య నాటిన చెట్లను కూల్చివేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా వాటిని సంరక్షించుకునేందుకు ఆయన అనేకమంది అధికారుల చుట్టూ తిరిగి ప్రాధేయపడ్డారు. అయితే వాటిస్థానంలో వాటికి బదులుగా మరోచోట మొక్కలు నాటుతామని ప్రభుత్వ అధికారులు భరోసా ఇచ్చారు. మొక్కలపై ఉన్న ప్రేమతోనే వనజీవి వారి కుమారులు, కుమార్తెతోపాటు మనుమలు, మనుమరాళ్లకు సైతం చెట్లపేర్లు పెట్టుకున్నాడు అంటే ఇతనికి హరితవనాల పట్ల ఉన్న ప్రేమ ఎంతటిదో తెలుస్తున్నది.
నివాళి అర్పించిన ప్రముఖులు
పద్మశ్రీ వనజీవి రామయ్య మృతిపట్ల అనేక మంది ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, తెలంగాణ, ఏపీ సీఎంలు రేవంత్‌రెడ్డి, నారాచంద్రబాబు నాయుడు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు, నారా లోకేష్, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బానోత్ చంద్రావతి, సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణతోపాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సామాజికవేత్తలు సోషల్ మీడియా వేదికల ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.
రామయ్య భౌతికకాయాన్ని సందర్శించి నివాళ్లులు అర్పించిన వారిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, సీపీఎం, సీపీఐ నాయకులు పోతినేని సుదర్శన్, బాగం హేమంతరావు, జిల్లా అదనపు కలెక్టర్లు శ్రీనివాసరెడ్డి, డాక్టర్ పీ శ్రీజ, ఆర్డీవో నర్సింహారావు, తహసీల్దార్ రాంప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి సిద్దార్థ విక్రమ్‌సింగ్, టీయూడబ్ల్యూజే (ఐజేయూ), టీడబ్ల్యూజేఎఫ్ నేతలు ఇతర జిల్లా అధికారులు, అటవీశాఖ అధికారులు, సామాజికవేత్తలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.