కారేపల్లి, అక్టోబర్ 18 : వ్యవసాయ రంగం ప్రస్తుత సమయంలో అనేక ఆటుపోట్లు ఎదురుకుంటోంది.ఏది అభివృద్ధో, ఏది పతనమో అవగాహన లేమితో భూమి సాగు వనరులు నిస్పష్టంగా మారి భూమి సాగు సమస్యల వలయంగా మారుతుంది. నాణ్యత గల వ్యవసాయ ఉత్పత్తులకు ఇప్పుడు మంచి డిమాండ్ పెరుగుతుందని, సాంప్రదాయ వ్యవసాయానికి నీళ్ళోదిలి, నాసిరకం వ్యవసాయ ఉత్పత్తుల వైపు చూస్తున్నారని, అభ్యుదయ రైతులు అంటున్నారు.
వ్యవసాయంలో రసాయనాలకు స్వస్తి చెప్పి నేల ఆరోగ్యాన్ని పెంచే వ్యవసాయ విధానాలు ఆచరించడమే కాక ఇతర రైతులకు తెలియజెప్పి తను సన్నకారు రైతే అయినా తన ఆశయాలు పెద్దవని చాటుతున్న ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం లింగం బంజర గ్రామానికి సూరపురెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సాగులో కొత్త దారులు వెతికాడు. ప్రకృతి వ్యవసాయం సేంద్రియ పద్ధతిలో వరి వంగడాల సాగుపై అధ్యయనం చేశాడు. దీంతో గత రెండేళ్లుగ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాడు. రసాయనాలకు అలవాటు పడ్డ నేల కావడంతో తొలి ఏడాది తక్కువ పంట వచ్చిందని, రెండోసారి పంట బాగానే వచ్చిందని రైతు విష్ణువర్ధన్ రెడ్డి చెప్పాడు.
వ్యవసాయంపై ఆసక్తితో రెండు సంవత్సరాలుగా ఈ పంటలు పండిస్తున్నానన్నారు. రెగ్యులర్గా పండించే వరి రకాలు కాకుండా కొత్త రకాలు పండించాలనే ఆలోచనతో కామేపల్లి విశాల సహకార పరపతి సంఘం(సొసైటీ) నుంచి విత్తనాలను దిగుమతి చేసుకున్నాని చెప్పాడు. నిత్యం యూట్యూబ్ లో అనుసరిస్తూ వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలతో పంటలు సాగు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. పంట వేసే ముందు పచ్చి రొట్టను పొలంలో కలియ దున్నినట్లు, అంతకుముందు పశువుల ఎరువును పిచికారి చేశానని దీంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుందన్నారు.