కారేపల్లి, ఏప్రిల్ 02 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల అమ్మకo, దానిని వ్యతిరేకించిన వారిపై నిర్భందాన్ని ప్రయోగిస్తూ అక్రమ కేసులు పెట్టడాన్ని వెనక్కి తీసుకోవాలని సీపీఎం సింగరేణి మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కారేపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొండబోయిన నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజా సంపదను కమీషన్లకు అమ్ముకుంటుందని దుయ్యబట్టారు. అడ్డుకోజూస్తే నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, జైళ్లపాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ చర్యలను ప్రజలంతా వ్యతిరేకించాలన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే విధంగా కుయుక్తులు పన్నుతున్నదని దానిని మానుకోవాలన్నారు. లేకపోతే ప్రభుత్వ భూముల రక్షణకై ప్రజా ఉద్యమాలు ఉవ్వెత్తున లేస్తాయని హెచ్చరించారు. పార్టీ మండల కార్యదర్శి కె.నరేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో డివిజన్ కమిటీ సభ్యుడు వజ్జ రామారావు, సీనియర్ నాయకులు తలారి దేవప్రకాశ్, ముక్క సీతారాములు, మండల కమిటీ సభ్యులు జి.వెంకన్న, కేశగాని ఉపేందర్, చిలుముల భరత్, రాచర్ల రణధీర్, ఆరేళ్లి శ్రీరాములు, కోటేశ్, రాజు, సైదులు, బాబు, రాయుడు పాల్గొన్నారు.