భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ)/ ఇల్లెందు: ఇల్లెందు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం హైడ్రామా, ఉద్రిక్తత నడుమ వీగిపోయింది. తెలిసిన వివరాల ప్రకారం.. మున్సిపల్ చైర్మన్‌పై 19 మంది కౌన్సిలర్లు అసమ్మతి ప్రకటించారు. ఈ మేరకు గత నెల 19న జిల్లాకేంద్రంలో కలెక్టర్ ప్రియాంక ఆలను కలిసి మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరారు. ఇల్లెందు మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు ప్రిసైడింగ్ ఆఫీసర్, కొత్తగూడెం ఆర్డీవో శిరీష ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం కోరం లేక వీగిపోయింది. కోరం పూర్తి కావాలంటే సమావేశానికి స్థానిక మొత్తం సభ్యులు 24 మంది, ఎక్స్అఫీషియో సభ్యుడైన ఎమ్మెల్యేతో కలిపి తక్కువలో తక్కువ 17 మంది హాజరు కావాల్సి ఉండగా, కేవలం 15 మంది హాజరయ్యారు. కోరం లేదని నిర్ధారించిన ప్రిసైడింగ్ అధికారి అవిశ్వాస తీర్మానం వీగినట్లు ప్రకటించారు. ఆమె అవిశ్వాసాన్ని 12 గంటలకు వాయిదా వేశారు. అయినప్పటికీ 12 గంటలకు 15 మంది సభ్యులే హాజరయ్యారు. దీంతో ప్రిసైడింగ్ ఆఫీసర్ అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు ప్రకటించారు.
ఇల్లెందు, ఫిబ్రవరి 5: ఇల్లెందు పట్టణ కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావు అపహరణపై ఆయన భార్య వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కోరం కనకయ్యపై కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై కొందరు కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టారని, ఆ సమావేశానికి హాజరయ్యేందుకు వెళుతున్న కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావును అపహరించారని తమకు ఫిర్యాదు అందిందని సీఐ వివరించారు.