భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : చిన్న వయసులో పిల్లల ఆరోగ్యంపై సరైన దృష్టి పెట్టకపోతే చిన్న జబ్బులే చివరికి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇందుకోసం ఏటా నులిపురుగుల నివారణ దినాన్ని నిర్వహిస్తోంది. గురువారం నుంచి ఈ నెల 22 వరకు నులిపురుగుల నివారణకు అధికారులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వైద్యారోగ్యశాఖ అధికారులు ఆల్బెండజోల్ మాత్రలను సిద్ధం చేశారు. ఇందుకోసం ముందస్తుగా భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ అన్ని శాఖల అధికారులతో సమావేశమయ్యారు. గురువారం జరిగే కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. వైద్యారోగ్య, విద్య శాఖ, మాతా శిశు సంరక్షణ శాఖలను సమన్వయం చేసి వారికి విధులు కేటాయించారు. 1 నుంచి 19 ఏళ్ల పిల్లలను గుర్తించి వారికి ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికే అంగన్వాడీలు, పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థుల జాబితాను సిద్ధం చేశారు.
జిల్లాలో 3,22,333 బాలల గుర్తింపు
నులి పురుగుల నివారణ కోసం పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. గురువారం నుంచి ఈ నెల 22 వరకు నులిపురుగుల నివారణ వారోత్సవాలు నిర్వహించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1 నుంచి ఐదేళ్లలోపు పిల్లలు 75,694 మంది, 6 నుంచి 19 ఏళ్లలోపు లోపు పిల్లలు 2,46,639 మంది కలిపి మొత్తం 3,22,333 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ప్రతి ఒక్కరూ మాత్రలు వేసుకునే విధంగా అవగాహన కల్పించనున్నారు. 2020 అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు, 1,763 ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మాత్రలు వేయనున్నారు. 38 ఆసుపత్రుల నుంచి ఆల్బెండజోల్ మాత్రలను సరఫరా చేయనున్నారు. 1 నుంచి 2 ఏళ్లలోపు పిల్లలకు మాత్రలను పొడిచేసి వేయనున్నారు.
రక్తహీనతే ప్రధాన లక్షణం
పిల్లల పొట్టలో నులి పురుగులు ఉంటే ముందుగా కన్పించే ప్రధాన లక్షణం రక్తహీనతే. పిల్లల్లో ఆకలి మందగించడం, తరచూ విరేచనాలు కావడం, బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు తరువాత కన్పిస్తాయి. పరిశుభ్రత పాటించకపోవడం వల్లనే నులి పురుగులు వస్తాయని చెబుతున్నా వైద్యులు. చేతిగోర్లను శుభ్రం చేసుకోకపోవడం, కలుషిత ఆహారం తీసుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, ఆ ప్రదేశాల్లోనే సంచరించడం వంటి కారణాల వల్ల నులి పురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. తరువాత కడుపులో చేరిపోతాయి. అక్కడ అవి పెరుగుతూ ఆకలి లేకుండా చేస్తాయి. అందువల్ల నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవడం తప్పనిసరి.