రఘునాథపాలెం, నవంబర్ 9 : నేటి దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికీ అవసరమైన, అనివార్యమైన, అవయవమైన సొంత వాహనం కలను ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే (టీటీ)’ సంస్థలు సాకారం చేశాయి. ఇందుకోసం ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో ‘ఆటో షో’ పేరుతో చక్కటి వేదికను తయారు చేశాయి. ఇందులో వివిధ కంపెనీలకు చెందిన సరికొత్త మోడళ్ల కార్లను, బైకులను ప్రదర్శనకు ఉంచాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వాహన ప్రియులు, వాహనాల కొనుగోలుదారులు, సందర్శకులు రెండో రోజు ఆదివారమూ అధిక సంఖ్యలో వచ్చి వీక్షించారు.

ఫీచర్లు ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా ఉన్న వాహనాలను ఆసక్తిగల వాహనదారులు అదే వేదిక వద్ద కొనుగోలు చేశారు. మరికొందరు వాహనదారులు తమకు ఇష్టమైన కార్లను బుక్ చేసుకున్నారు. రెండు రోజులపాటు సందడిగా సాగిన ఈ ఆటో షో చివరి రోజు ఆదివారం పండుగ వాతావరణంలో ముగిసింది. ఆఖరి రోజున కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ రెండు రోజులపాటూ సందర్శకులు, వాహనప్రియులతో ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాళాల మైదానం కోలాహలంగా కన్పించింది.

ఆటో షోలో భాగంగా వాహనాల కొనుగోలు చేసేందుకు విచ్చేసిన సందర్శకుల కోసం ‘నమస్తే తెలంగాణ’ కూపన్లను అందజేసి బంపర్ డ్రా సౌకర్యాన్ని కల్పించింది. డ్రా తీసేందుకు అతిథులుగా శ్రీగర్భ ఆసుపత్రి యజమాని డాక్టర్ బాలభాస్కర్‌రెడ్డి, బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ విజయ్‌కుమార్ హాజరయ్యారు. గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు.

ఈ ఆటోషోలో నమస్తే తెలంగాణ పత్రిక బ్రాంచ్ మేనేజర్ రేనా రమేశ్, బ్యూరో ఇన్చార్జి మాటేటి వేణుగోపాల్, యాడ్స్ మేనేజర్ బోయిన శేఖర్‌బాబు, సర్క్యులేషన్ మేనేజర్ రాంబాబు, ఖమ్మం ఆర్సీ ఇన్చార్జి శీలం శ్రీనివాస్, బోయిన కృష్ణ, యాడ్స్ సిబ్బంది పసుపులేటి నాగరాజు, సోలిపురం సురేందర్‌రెడ్డి, పుట్టా ప్రభాకర్, మల్లెల సురేశ్, మాధా దశరథ్, అమృతపు కరుణాకర్, సర్యులేషన్ సిబ్బంది భద్రం, భిక్ష్మారెడ్డి, ఆర్వీ, హెచ్ఆర్ శ్రీను పాల్గొన్నారు.
రెండు రోజుల ఆటో షోలో స్టాల్స్ ఏర్పాటు చేసి వాహనాలను అందుబాటులో ఉంచి వాటి ప్రత్యేకతలను వాహనప్రియులకు వివరించిన ఆయా సంస్థల ప్రతినిధులకు, బ్యాంకర్లకు ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక మెమెంటోలను అందజేసింది. వీటిని ముఖ్య అతిథి మేయర్ ఆయా కంపెల బాధ్యులకు బహూకరించారు. అదేవిధంగా ఆర్కా ఆటోమోటివ్ సంస్థకు చెందిన హోండా యాక్టివాను గోపాలపురానికి చెందిన మౌనిక కొనుగోలు చేయగా.. ఆ బైక్ కీని సదరు కొనుగోలుదారుకు మేయర్ అందజేశారు. ఆయా సంస్థల కార్లను కూడా పలువురు వినియోగదారులు బుక్ చేసుకున్నారు.

నమస్తే తెలంగాణ ఆటో షోలో భాగంగా ప్రముఖ, దిగ్గజ వాహన కంపెనీలైన మహావీర్ బెంజ్, కియా ఆటోమోటివ్, భారత్ హుండాయ్, వీవీసీ మోటార్స్, వెంకటరమణ బజాజ్, మహావీర్ గ్రూప్స్ స్కోడా, కాకతీయ టయోటా, వెంకటరమణ బజాజ్, రాయపూడి సుజుకీ, వెంకటరమణ టాటా మోటార్స్, ఆర్కా రెనాల్ట్, భారత్ పియాగో, వరుణ్ గ్రూప్ మారుతీ సుజుకీ ఎరినా ఎల్ఎల్పీ, ఆర్కా ఆటోమోటివ్స్ హోండా సంస్థలు పాల్గొని తమ స్టాళ్లల్లో తమ వాహనాలను ప్రదర్శనగా ఉంచాయి. వీటితోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు కూడా షోలో ఉండి వాహన రుణాల సదుపాయం కోసం స్టాళ్లు ఏర్పాటుచేశాయి.

వాహనం లేకుండా జీవనం గడవని ఈ రోజుల్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సంస్థలు ఏర్పాటు చేసిన ఆటో షో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉందని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) మేయర్ పునకొల్లు నీరజ పేర్కొన్నారు. ఖమ్మంతోపాటు హైదరాబాద్‌కు చెందిన దిగ్గజ వాహన కంపెనీలన్నింటినీ నమస్తే తెలంగాణ పత్రిక ఖమ్మం నగరంలో ఒక వేదిక వద్దకు చేర్చడం, సరికొత్త మోడళ్ల వాహనాలను ప్రదర్శనలో ఉంచడం జిల్లా ప్రజల అదృష్టమని అన్నారు. ఆటోషో ముగింపు వేడుకకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన నమస్తే తెలంగాణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. మారుతున్న సాంకేతికతకు, కాలానికి అనుగుణంగా ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికీ బైకు, కారు అత్యవసరమవుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో ఇలాంటి ఆటోషోలు వాహన ప్రియులకు ఎంతగానో దాహదపడుతాయని పేర్కొన్నారు. నచ్చిన, మంచి ఫీచర్లున్న వాహనాల కోసం షోరూం వెంట తిరిగే అవసరం లేకుండా, గందరగోళానికి గురికాకుండా ఈ ఆటో షో ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. వాహన రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లను కూడా ఇదే వేదికపైకి తేవడం మరో విశేషమని అన్నారు. ముందుగా ముఖ్య అతిథులను నమస్తే తెలంగాణ బ్యూరో ఇన్చార్జి మాటేటి వేణుగోపాల్ సాదరంగా ఆహ్వానించారు.
ప్రస్తుత సాంకేతిక యుగంలో ఇలాంటి వేదికలు వినియోగదారులకు ఎంతో అవసరం. సౌకర్యవంతం కూడా. అన్ని కంపెనీల వాహనాలు ఒకే చోట కొలువు తీరడంతో వినియోగదారులకు కూడా తమ అవసరాలకు అనుగుణంగా ఉండే వాహనాలను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. రుణ సౌకర్యం కల్పించేందుకు బ్యాంకులు కూడా ఇక్కడే ఉండడం సంతోషంగా ఉంది.
-బీ.బాలాజీ, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఖమ్మం
హైదరబాద్ తరహాలో ఖమ్మంలో కూడా ఆటో ఎక్స్పో ఏర్పాటు చేయడం నగరవాసులకు ఎంతో ఉపయోగకరం. కారు కొనుగోలుచేయాలంటే ఖమ్మం నగరంలోనే నాలుగు మూలలూ తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు అలా తిరిగి అలిసిపోయే ఇబ్బంది లేకుండా ఈ షోలో అన్ని కంపెనీల వాహనాలూ ఉన్నాయి. ఈ షో ఏర్పాటుచేసిన నమస్తే తెలంగాణకు ప్రత్యేక ధన్యవాదాలు.
-హెచ్.విలాసరావు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఖమ్మం
కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి ‘నమస్తే తెలంగాణ’ ఏర్పాటు చేసిన ఆటో ఎక్స్పో ఓ మంచి వేదిక. ఏ వాహనం కొనాలో అనే ఆయోమయం ఉన్నప్పుడు ఇలాంటి ఆటో షోలను సందర్శిస్తే చాలా అవగాహన పెరుగుతుంది. విభిన్న వాహనాలు, వాటి ఫీచర్లు వంటివి తెలుస్తాయి. ఆయా కంపెనీల బాధ్యులు కూడా తమ వాహనాలను విశిష్టతలను వినియోగదారులకు వివరిస్తారు. ఇదే చక్కటి అవకాశం.
-డాక్టర్ ముస్తాఖ్, ఖమ్మం