వైరా టౌన్/కొణిజర్ల, ఆగస్టు 22 : ‘తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే శ్రీరామరక్ష. బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి ఆయా పథకాలే దోహదపడతాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం వజ్రంలా మారింది’ అని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు మదన్‌లాల్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలనే ప్రచారాస్ర్తాలుగా మలుచుకుంటాం. ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు సాగుతాం. విపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వైరా నియోజకవర్గంపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం. వైరా టికెట్‌ను తనకు ఖరారు చేసిన సందర్భంగా ‘నమస్తే’కు మదన్‌లాల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ప్రశ్న : టికెట్ కేటాయింపుపై మీ భావన ఎలా ఉంది?
జవాబు : వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా తనను ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. నా బాధ్యతను గుర్తెరిగి కేసీఆర్ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకెళ్తా.
ప్ర : ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయా?
జ : తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశంలోని వివిధ రాష్ర్టాలకు మార్గదర్శకంగా ఉన్నాయి. నిస్పక్షపాతంగా క్షేత్రస్థాయిలో ప్రజానీకానికి అందుతున్నాయి. రాష్ట్రంలో అమలవుతున్న వినూత్న పథకాలే మూడోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకొస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తున్నా.
ప్ర : వచ్చే ఎన్నికల్లో మీ విజయావకాశాలు ఏమిటి?
జ : రాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రజా అవసరాలపై క్షేత్రస్థాయిలో పూర్తి అవగాహన ఉన్న సీఎం కేసీఆర్ వారి అవసరాలకు అనుగుణంగా పథకాలను రూపొందించి పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దీంతో మారుమూల గ్రామాల్లోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల అందుతున్నాయి. ఈ పథకాల కొనసాగింపు కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుంది.
ప్ర : నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు ఏమైనా ఉన్నాయా?
జ : గిరిజనులు అధికంగా ఉన్న వైరా నియోజకవర్గంలో పలు సమస్యలపై పూర్తిస్థాయి అవగాహన ఉంది. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. కేసీఆర్ సర్కారు 500 జనాభా దాటిన తండాలను పంచాయతీలుగా గుర్తించి వాటి అభివృద్ధికి నిధులు కేటాయించింది. ఇంకా కొన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, వంతెనలు, రోడ్లు నిర్మించాల్సి ఉంది. వాటన్నింటినీ భవిష్యత్‌లో ప్రజాశీర్వాదం మేరకు పూర్తి చేస్తా.
ప్ర : వచ్చే ఎన్నికల్లో కలిసొచ్చే అవకాశాలు ఏమిటి?
జ : రాష్ట్రంలోని ప్రతి పేదవాడి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలైన పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ తదితర సంక్షేమ పథకాలే తన విజయానికి దోహదపడతాయి.
ప్ర : ఓటర్లకు మీరిచ్చే సందేశం ఏమిటి?
జ : ప్రజల కోసం అనునిత్యం పనిచేసే నాయకుడినే ఎన్నుకోవాలి. ఎన్నికల సమయాల్లో విపక్ష పార్టీలు ఇచ్చే మాయ హామీలను ప్రజలు విశ్వసించొద్దు. నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేసే అభ్యర్థిని ఎన్నుకోవాలి. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసే వారిని ఎన్నుకోవడం ద్వారా పట్టణాలు, గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయి.