కారేపల్లి : రైతులకు మద్దతు ధర అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు అన్నారు. సీపీఐ(ఎం), తెలంగాణ రైతు సంఘం బృందాలు ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మాణిక్యారం, ఎర్రబోడు గ్రామాల్లో పంటలను పరిశీలించాయి. అధిక వర్షాలతో పత్తి పంట ఎదుగుదల లేక, గిట్టబారి పోవటం, పత్తికాయ నల్లబడటంను వారు పరిశీలించారు. వరి పోలాలు చీడపీడలతో తాలు అధికంగా కనిపిస్తుందని రైతులు సీపీఐ(ఎం) నేతలకు వివరించారు. అధిక వర్షాలతో పెసర పంట చేతికి రాకుండా పోయిందనిరైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈసందర్బంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ వాతావరణ పరిస్ధితి సరిగా లేక పంటలు రక్షించుకోవటానికి రైతులు అవస్థలు పడ్డారన్నారు. యూరియా కొరతతో రైతుకు పంట పెట్టుబడి విపరీతంగా పెరిగిందన్నారు. రైతుకు గిట్టుబాటు కావాలంటే పత్తి కొనుగోలు సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కారేపల్లిలో వెంటనే సీసీఐ కేంద్రాన్ని తెరిచి మద్దతు ధర రూ.7710తో కొనుగోళ్లు ప్రారంభించాలన్నారు. ఈకార్యక్రమంలో సీపీఐ(ఎం) వైరా డివిజన్ కమిటీ సభ్యులు వజ్జా రామారావు, మండల కమిటీ సభ్యులు పోతర్ల నాగేశ్వరరావు, నాయకులు కరపటి సీతారాములు, కుర్సం శ్రీను, బొజెడ్ల గోవిందరావు, వల్లపు లింగయ్య, కరపటి లక్ష్మయ్య, పాయం ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు.