రామవరం/ ఖమ్మం/ భద్రాచలం/ కూసుమంచి, ఏప్రిల్ 18: కేంద్ర ప్రభుత్వం తెచ్చింది వక్ఫ్‌బోర్డు చట్ట సవరణ బిల్లు కాదని.. అది ముస్లింలపై కక్షసాధింపు బిల్లని వివిధ ముస్లిం సంఘాల నేతలు, మత పెద్దలు విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలపై కక్షసాధింపు చర్యతో లౌకిక రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇలాంటి మతోన్మాద చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
వక్ఫ్‌బోర్డు చట్ట సవరణ బిల్లులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ముస్లిం సంఘాల నాయకులు, మత పెద్దలు శుక్రవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ర్యాలీలు నిర్వహించారు. భద్రాద్రి జిల్లా రామవరంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. కూసుమంచిలో మానవహారం చేపట్టారు. ఖమ్మంలో ప్రదర్శన చేపట్టి ‘రాజ్యాంగాన్ని పరిరక్షిద్దామని, వక్ఫ్‌చట్టాన్ని తిరస్కరిద్దామని నినాదాలు చేశారు.