మున్నేరు వరద ఉధృతి తగ్గి రోజులు గడుస్తున్నా బాధితుల ఎదురుచూపులు ఇంకా ఎదురుచూపులుగానే ఉన్నాయి. సర్వం కోల్పోయిన తమకు రూ.10 వేల సాయమందిస్తామంటూ సర్కారు చెప్పిందని.. అవి చేతికొస్తే తమకు ఎంతోకొంత అక్కరకొస్తాయని.. వరద బాధితులు ఆశించారు. కానీ సాయం చేస్తామన్న సర్కారు జాడ లేకుండా పోవడంతో వారి ఆశలన్నీ అడియాశలుగానే మిగులుతున్నాయి.
సర్వేల పేరుతో సర్కారు సాగదీస్తుండడం, ఆరు రోజులైనా ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడం వంటి కారణాలతో వరద బాధితులకు సర్కారు సాయం ఇంకా అందని ద్రాక్షగానే మిగిలింది. చివరికి తమ వీధులను శుభ్రం చేసే వారు కూడా లేరని, సిబ్బంది వచ్చి తమ ఇళ్లముందు బ్లీచింగ్ కూడా చల్లిన పరిస్థితి లేదని వాపోతున్నారు. కనీసం ‘తిన్నారా?’ అని పలుకరించి ఆహారం అందించిన అధికారులు కూడా లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 6
ఖమ్మం రూరల్ మండలంలో వరద ఉధృతి తగ్గి ఆరు రోజులు గడిచినా సాయం కోసం బాధితులు ఎదురుచూస్తూనే ఉన్నారు. అధికారులు వచ్చి సర్వేలు చేస్తున్నారే తప్ప ప్రభుత్వం నుంచి ఏమాత్రం సాయం అందకపోవడంతో తమ బతుకులు ఏమిటి ఇలా అంటూ దిగులు చెందుతున్నారు. ఆకేరువాగు సమీపంలోని వాల్యతండా కస్నాతండా, పిట్టలవారిగూడెం, తనగంపాడు గ్రామాలు వరద తాకిడికి చిన్నాభిన్నమయ్యాయి.
వీటితోపాటు తీర్ధాల, పోలెపల్లి, పెద్దతండా, గుదిమళ్ల తదితర గ్రామాల పరిధిలోని కాలనీలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పెద్దతండా పరిధిలోని రాజీవ్ గృహకల్ప, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ, జలగం నగర్, నాయుడుపేట తదితర కాలనీల్లో రూ.కోట్లలో నష్టం వాటిల్లింది. ఇళ్లల్లోని సామగ్రి, బియ్యం, బట్టలు, పుస్తకాలన్నీ నీటి పాలయ్యాయి. ఇళ్ల నిండి బురద పేరుకుపోయింది. ఇంత జరిగినా ప్రభుత్వం అందించే చిరు సాయం కొద్ది ప్రాంతాలకే పరిమితమవుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఇందిరమ్మ కాలనీ సగానికి సగం మునిగినా ఇంతవరకు పంచాయతీ కార్యదర్శి స్థాయి ఉద్యోగి కూడా తమ వైపు రాలేదని వారు వాపోతున్నారు. మురుగు కంపు కొడుతున్నా కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లే నాధుడు కూడా కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయుడుపేటలోని అనేక కాలనీల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. మూడు రోజుల నుంచి అధికారులు, సిబ్బంది సర్వే పేరుతో కాలయాపన చేస్తున్నారనే తప్ప పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
మా ఇల్లు వరదలో మునిగిపోయి కట్టుబట్టలు కూడా పనికిరాకుండా పోయాయి. కనీసం పంచాయతీ కార్యదర్శి వచ్చి ఎలా ఉన్నారు అని అడిగిన పాపాన పోలేదు. ఇంటిమందు దుర్వాసన వస్తుంది. సాయం చేయకున్నా బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని కాలనీవాళ్లతో ఫోన్ చేయించినా ఎవరూ రాలేదు. వరదలతో ఇంట్లో ఫ్యాన్ చెడిపోయింది. ఇంటిని చేస్తుంటే బాధగా ఉంది. పేదలు ఉండే ఇందిరమ్మ కాలనీ అంటే అలుసా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. కన్నెత్తి కూడా చూడడం లేదు.
-కట్ల ఉమ, ఇందిరమ్మ కాలనీ, ఖమ్మం రూరల్
వరదల్లో మా ఇల్లు పూర్తిగా మునిగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సహాయం అందలేదు. గురువారం ఎవరో స్వామీజీ ఇచ్చి దుప్పట్లు ఇచ్చారు. అవి తప్ప ఏ సాయం అందలేదు. ఎవరో వచ్చి ఉదయం మా కుటుంబ వివరాలు తీసుకెళ్లారు. ఇల్లు ఒంపులో ఉండడంతో ఒక్క వస్తువు దక్కించుకోలేకపోయాం. వరద తగ్గిన తెల్లారి బీఆర్ఎస్ నాయకుడు రాకేశ్‌రెడ్డి వచ్చి చూసిపోయిండు. చేతిలో చిల్లిగవ్వ లేదు. కిరాణ సామాన్లు అందించాలి.
-పడిషాల సుజాత, సుతారి బజార్, నాయుడుపేట, ఖమ్మం రూరల్
అర్ధరాత్రి వచ్చిన వరదలతో ఇంట్లో వస్తువులన్నీ పాడైపోయాయి. బట్టలు కూడా పనికి రాకుండా పోయాయి. టీవీ, ఫ్యాన్లు ఏమీలేవు. పునరావాస కేంద్రంలో రెండు రోజులు బువ్వ పెట్టారు. చెద్దరు ఇచ్చారు. అంతే.. ఇంతవరకు మాకు ఎలాంటి సాయం అందలేదు. ఏ సాయమైనా పై బజార్‌కు చేస్తున్నారు. కాళ్లు సరిగ్గా లేక నడవలేక పోతున్నా. సరుకులు ఇంటికి వచ్చి ఇస్తే బాగుంటుంది. పోయిన సామాన్లు ఇక కొనుక్కోలేం.
-కొట్టే సరోజనమ్మ, సుతారి బజార్, నాయుడుపేట, ఖమ్మం రూరల్
వరదలు తగ్గినా తిన్నారా.. అడిగిన ఒక్క అధికారి కూడా లేడు. సాయం కూడా అందలేదు. తెల్లారేసరికి కాలనీ వాళ్లు వచ్చి మమ్మల్ని కాపాడకపోతే ఇంట్లో ఒక్కరం కూడా మిగిలేవాళ్లం కాదు. గత శనివారం వచ్చిన వరదలకు మా కాలనీలో దాదాపు సగం ఇండ్లు మునిగిపోయాయి. మా ఇంట్లో ఉన్న మూడు క్వింటాళ్ల బియ్యం అవతల పారబోస్తుంటే దుఃఖం వచ్చింది. కోడలికి బట్టలు లేకపోతే కొడుకు ప్యాంటు వేసుకొని పునరావాస కేంద్రంలో గడిపింది. సీఎం రేవంత్‌రెడ్డి చేస్తాను అన్న సాయం ఇటువైపు రాలేదు.
-గోలి మరియమ్మ, ఇందిరమ్మ కాలనీ, ఖమ్మం రూరల్