ఇల్లెందు/ భద్రాచలం, ఆగస్టు 10: ‘పింఛన్ పెంచుతావో గద్దె దిగుతావో తేల్చుకో రేవంత్‌రెడ్డీ’ అంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి 20 నెలలైనా దివ్యాంగులకు పింఛన్ పెంచడంలో విఫలమైందని విమర్శించారు. భద్రాద్రి జిల్లా ఇల్లెందులో ఆదివారం నిర్వహించిన ‘దివ్యాంగులు, చేనేత కార్మికుల మహాగర్జన సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలోని దివ్యాగులు, చేనేత కార్మికుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈలోపు దివ్యాంగులకు పింఛన్ పెంచడమో, లేదంటే సీఎం రేవంత్‌రెడ్డి తన గద్దె దిగడమో తేల్చుకోవాలని సూచించారు.
అయినప్పటికీ పింఛన్ పెంచకపోతే సీఎం రేవంత్‌ను ఎలా గద్దె దించాలో తమకు తెలుసునని, అదేంటో ఉద్యమంలో చూపిస్తామని తేల్చిచెప్పారు. కాగా, ఇదే అంశంపై భద్రాచలంలో నిర్వహించిన సమావేశంలోనూ మంద కృష్ణమాదిగ మాట్లాడారు. దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్ ఇస్తామంటూ ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ కాంగ్రెస్ ప్రకటించిందని గుర్తుచేశారు. దివ్యాంగుల సంఘం నేతలు, ఎమ్మార్పీస్ నాయకులు పాల్గొన్నారు.