రామవరం, డిసెంబర్ 5 : తెలంగాణ రాష్ట్ర సాధనలో మలిదశ ఉద్యమకారుడు మోరె భాస్కర్రావు పాత్ర మరువలేనిదని, ఆయన మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని రామవరంలో తెలంగాణ ఉద్యమకారుడు భాస్కర్ మరణవార్త తెలుసుకున్న ఆయన ఢిల్లీ నుంచి గురువారం నేరుగా భాస్కర్ స్వగృహానికి చేరుకున్నారు.
ఆయనతోపాటు బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, దిండిగల రాజేందర్లు భాస్కర్ మృతదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో ఎంపీ వద్దిరాజు, రేగా మాట్లాడుతూ భాస్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇటీవల నిర్వహించిన దీక్షా దివస్ను విజయవంతం చేయడంలో భాస్కర్ కృషి, పాత్ర మరువలేనిదన్నారు. అనంతరం పార్టీ ఆఫీస్ నుంచి బయల్దేరిన భాస్కర్ అంతిమ యాత్రలో ఎంపీ వద్దిరాజు, రేగా కాంతారావు, నాయకులు పాడె మోసి కన్నీటి వీడ్కోలు పలికారు.
కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సాబీర్పాషా, కోనేరు సత్యనారాయణ, బీజేపీ నుంచి రంగా కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కాగా.. ఎంపీ వద్దిరాజు ఫోన్ ద్వారా మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలు భాస్కర్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. అనివార్య కారణాలతో తాము రాలేకపోతున్నామని, మీరు అధైర్యపడొద్దని, మీకు అండగా పార్టీ ఎల్లప్పుడు ఉంటుందని భరోసా ఇచ్చారు.