ఖమ్మం, సెప్టెంబర్ 26: పేదలకు గూడు కల్పించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ గెలుపుతోనే మరింత అభివృద్ధి, మరిన్ని సంక్షేమ పథకాలు సాధ్యమని స్పష్టం చేశారు. పేదలకు గూడు కల్పన కోసం ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటికే రూ.500 కోట్ల వరకు వెచ్చించినట్లు చెప్పారు. జీవో 58 కింద ఇళ్ల స్థలాల పట్టాలను, గృహలక్ష్మి పథకం కింద మంజూరు పత్రాలను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో మంగళవారం ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు. ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 58 జీవో కింద 3 వేల పైచిలుకు మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని, మరో 2 వేల మందికి ఇవ్వనున్నామని తెలిపారు. 6,400 మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇచ్చినట్లు చెప్పారు. వాటితో పాటు ఇప్పుడు 3 వేల మందికి గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు వివరించారు. ఈ గృహలక్ష్మి సాయానికి కూడా మరో రూ.500 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని తెలిపారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. గ్యారెంటీ కార్డులంటూ కొంతమంది వస్తున్నారని విమర్శించారు. వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. పేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందించాలన్న సంకల్పంతోనే సీఎం కేసీఆర్ 58, 59 జీవోలను, డబుల్ బెడ్రూం ఇళ్లను, గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారని వివరించారు. మంత్రి అజయ్‌ని, సీఎం కేసీఆర్‌ను మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్పష్టం చేశారు. మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, ఏఎంసీ చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత, డిప్యూటీ కమిషనర్ మల్లీశ్వరి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఖమ్మం, సెప్టెంబర్ 26: చాకలి ఐలమ్మ జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని మంత్రి అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఆమె పోరాట పటిమ తెలంగాణ తెగువకు నిదర్శనమని అన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా ఖమ్మం ధర్నాచౌక్ వద్ద ఆమె విగ్రహానికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి మంత్రి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడమే ఆమె చేసిన పోరాటానికి నిజమైన నివాళి అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమకారులను, పోరాటయోధులను గొప్పగా గౌరవించుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. రజకులు, నాయీబ్రాహ్మణుల ఆర్థిక స్వావలంబన, జీవన ప్రమాణాల పెంపుకోసం ప్రతిపాదించిన దోబీఘాట్లు, లాండ్రీలు, సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నట్లు వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. నిజాం పాలనకు, విసునూరు దేశ్‌ముఖ్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. అనాడు ఆమె చేసిన ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది అయిందని వివరించారు.