సాధారణంగా భారత పత్తి సంస్థ(సీసీఐ) కొనుగోలు కేంద్రంలో పత్తిపంటను రైతులు విక్రయించుకోవాలంటే సవాలక్ష ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనికి తోడు ఈ ఏడాది ప్రత్యేక యాప్‌లో స్లాట్ బుక్ చేసుకుంటేనే కేంద్రానికి పంటను తీసుకురావాల్సి ఉండడంతో పత్తి రైతులు పుట్టెడు కష్టాలు పడుతున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది వానకాలం సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో ఆశించిన దిగుబడులు రాలేదు. వర్షాలు, వరదల వల్ల పొలాలు ఊటబట్టడం, పైరుకు చీడపీడల బెడద పెరగడం, ప్రకృతి వైపరీత్యాలు చుట్టుముట్టడం వంటి సవాళ్లను ఎదురీదుకొని ఎంతోకొంత పంటను పండించి సీసీఐ కేంద్రానికి తీసుకొచ్చిన రైతులకు ఇక్కడ అనేక ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి.
ఖమ్మం జిల్లా రైతులు పత్తిని కూడా ప్రధాన పంటగా సాగు చేస్తున్నారు. ఈ వానకాలం సీజన్లో అధిక విస్తీర్ణంలోనే సాగు చేశారు. కానీ, చేతికొచ్చిన పంటను తీసుకొని మార్కెట్లకు తరలించిన రైతులకు మాత్రం సరైన ధర లభించడం లేదు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా జిన్నింగ్ మిల్లుల వద్ద అధికారులు సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే, సీజన్ ప్రారంభంలో పంటల నమోదు వంద శాతం జరగకపోవడం రైతులకు శాపమైంది. పంటల సాగు చేపట్టిన తొలినాళ్లలో ఏఈవో వద్ద పంటలను నమోదు చేసుకోని రైతులకు స్లాట్ బుక్ కావడం లేదు. మొదట్లోనే పంటల పేర్లు నమోదు చేసుకున్న రైతులకు యాప్‌లో స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కన్పిస్తున్నప్పటికీ.. ఆన్లైన్ విధానంపై అవగాహన లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ చిక్కులన్నీ భరించలేని రైతులు చాలామంది అక్కడే ప్రైవేటులో అంతకోఇంతకో విక్రయించుకొని వెళ్తున్నారు. ఏదులాపురం మున్సిపాలిటీలోని గుర్రాలపాడు వద్ద ఉన్న ఓ జిన్నింగ్ మిల్లులో అధికారులు ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రానికి ఆయా మండలాల రైతులు సోమవారం భారీగా పత్తి పంటను తీసుకొచ్చారు. వారిలో చాలామంది స్లాట్ బుక్ చేయించుకొని వచ్చినప్పటికీ వారిలో ఒక్కరిద్దరు రైతుల పంటలు తప్ప మిగిలిన రైతుల పంటల్లో తేమశాతం అధికంగా ఉందని సీసీఐ సిబ్బంది తేల్చారు. దీంతో వారంతా నిరాశతో వెనుదిరిగారు.
ఊళ్లలో తేమ పరీక్షలు శూన్యం
రైతులు తమ గ్రామాల్లో తేమ శాతాన్ని నిర్ధారించుకున్నాకే పత్తిని సీసీఐ కేంద్రాలకు తీసుకురావాలని, అందుకోసం ఊళ్లలోనే తేమ నిర్ధారణ యంత్రాలు అందుబాటులో ఉంచాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఆదేశించిన విషయం విదితమే. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై నాలుగైదు రోజులు గడుస్తున్నా గ్రామాల్లోగానీ, రైతు వేదికల వద్దగానీ ఆ యంత్రాల జాడేలేదు. దీంతో రైతులు తమ పంటను నేరుగా సీసీఐ కేంద్రాల వద్దకు తీసుకెళ్తున్నారు. తేమ ఎక్కువ ఉందని అక్కడ సీసీఐ సిబ్బంది నిర్ధారించడంతో వ్యయప్రయాసలకోర్చి మళ్లీ ఇంటికి తెచ్చుకుంటున్నారు. ఖర్చులు భరించలేదని రైతులు అక్కడే ఎంతకో ఒకంతకు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించుకొని వస్తున్నారు.
ఆన్లైన్ విధానంతో మరిన్ని అవస్థలు
ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆన్లైన్ విధానం రైతులకు ప్రయోజనకరమైనప్పటికీ రైతులందరికీ యాప్‌పై అవగాహన లేకపోవడం వల్ల వారు మరిన్ని అవస్థలు పడుతున్నారు. పంట వేసిన ప్రారంభంలోనే రైతులు ఏఈవో వద్దకు వెళ్లి తాము ఏయే పంటలు సాగుచేస్తున్నామో నమోదు చేయించుకోవాలి. అలా క్రాప్ బుకింగ్ చేయించుకున్న రైతులు మాత్రమే కిసాన్ యాప్ ద్వారా సీసీఐలో పంటను విక్రయించుకునే అవకాశం ఉంది. తొలుత క్రాప్ బుకింగ్ చేసుకోని రైతుల వివరాలు ఇప్పుడు కిసాన్ యాప్‌లో కన్పించవు కాబట్టి వారు తమ పంటను సీసీఐలో విక్రయించలేరు. క్రాప్ బుకింక్, స్లాట్ బుకింగ్‌లపై అవగాహన లేని రైతులు ఇక్కట్ల పాలవుతున్నారు. ప్రైవేటులో తెగనమ్ముకుంటున్నారు. రైతు వేదికల వద్ద ప్రత్యేక కౌంటర్లు పెట్టి క్రాప్ బుకింగ్, స్లాట్ బుకింగ్‌లపై అవగాహన కల్పించి, తేమ నిర్ధారణ యంత్రాలను అందుబాటులో ఉంచితేనే రైతులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.
ట్రాక్టర్ కిరాయి దండుగైంది..
సీసీఐ వద్దకు పంటను తీసుకొచ్చి నిండా మునిగాను. ట్రాక్టర్లో పంటను తెస్తే తీరా దాని కిరాయి కూడా దండగైంది. ఉదయం సీసీఐ వాళ్లు వచ్చి తేమ శాతం పరీక్షలు చేశారు. నా పంటలో 16 శాతం తేమ ఉందని చెప్పారు. ఇంటి వద్ద ఇంకా ఆరబెట్టి మళ్లీ తేవాలని తిప్పిపంపారు. మా ఊళ్లోనే తేమ పరీక్ష చేస్తే ఇంత ఖర్చు పెట్టి ఇక్కడిదాకా వచ్చేవాణ్ని కాదు కదా.
-మద్దినాల రామలింగయ్య, రైతు, కట్టుకూరు, ముదిగొండ
ఆరబెట్టి తీసుకొచ్చినా ఫలితం లేదు..
పంటను ఎంతో జాగ్రత్తగా ఆరబెట్టి తీసుకొచ్చాను. తీరా ఇక్కడికొస్తే ఫలితం లేకుండాపోయింది. నేను పంట తెచ్చిన ట్రాక్టర్లో మూడు వైపులా తేమ శాతం పరీక్షలు చేశారు. రెండు వైపులా 12 శాతం వచ్చింది. మరోవైపున 15 శాతం వచ్చింది. దీంతో సీసీఐ సిబ్బంది నా పంటను తిరస్కరించారు. ఈ విషయం ఇంటికాడ తెలిసినా బాగుండేది. ఆన్లైన్ చేయడం నాకు రాదు. ఎవరితోనో చేయించుకొని వస్తే కొర్రీలు పెట్టారు.
-పర్సగాని వెంకటేశ్వర్లు, రైతు, పెద్దమండవ, ముదిగొండ