అత్యాధునిక సౌకర్యాలతో ఖమ్మం నగరంలో వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ నిర్మించామని, గజ్వేల్ తర్వాత ఇదే అతిపెద్ద మార్కెట్ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం ఆయన క్యాంప్ కార్యాలయంలో 62 మందికి రూ.25లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. అనంతరం వీడీవోస్ కాలనీలో సమీకృత మార్కెట్‌ను సందర్శించారు. మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తున్న మహిళలతో మాట్లాడారు. ఎవరెవరు ఏయే రకాల కూరగాయలు విక్రయిస్తున్నారు? ఖర్చులు పోను రోజుకు ఎంత ఆదాయం వస్తున్నది.? ఏయే కూరగాయలకు గిరాకీ ఉంది? కొత్త మార్కెట్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి..? అనే అంశాలపై ఆరా తీశారు. అనంతరం మంత్రి స్వయంగా కూరగాయలు కొనుగోలు చేశారు.
ఖమ్మం, ఫిబ్రవరి 9: రాష్ట్ర ప్రభుత్వం గజ్వేల్ తర్వాత ఖమ్మంలోనే అతిపెద్ద సమీకృత మార్కెట్ నిర్మించిందని, రూ.8 కోట్ల నిధులతో ఖమ్మం నడిబొడ్డున వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ నిర్మించిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. గురువారం సాయంత్రం ఆయన నగరంలోని వీడీవోస్ కాలనీలో సమీకృత మార్కెట్‌ను సందర్శించారు.
ముందుగా మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తున్న మహిళా రైతులతో మాట్లాడారు. ఎవరెవరు ఏయే రకాల కూరగాయలు విక్రయిస్తున్నారు? ఖర్చులు పోను రోజుకు ఎంత ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు? ఏయే కూరగాయలకు గిరాకీ ఉంది? కొత్త మార్కెట్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి..? అని ఆరా తీశారు. అనంతరం మంత్రి స్వయంగా కూరగాయలు కొనుగోలు చేశారు. చేపల విక్రయం కేంద్రంలో తక్కెడ పట్టి చేపలను తూకం వేశారు.
పార్కింగ్ సౌకర్యంపై నగరపాలక సంస్థ అధికారులకు సూచనలిచ్చారు. తర్వాత మంత్రి మాట్లాడుతూ.. రెండెకరాల స్థలంలో ఒకే మార్కెట్లో కూరగాయలు, పండ్లతో పాటు మాంసాహారం అందుబాటులో ఉండేలా నిర్మించామన్నారు. నగరవాసులకు తాజా కూరగాయలు అందించాలనే ఉద్దేశంతో రైతులకు ఉచితంగా దుకాణాలను కేటాయించామన్నారు. సరసమైన ధరలకే ప్రజలకు కూరగాయలు అందుతాయన్నారు.
నాన్‌వెజ్ మార్కెట్లో 35 దుకాణాలు, వెజ్ మార్కెట్లో 100 దుకాణాలు ఏర్పాటు చేశామన్నారు. వీటిలో ఎనిమిది దుకాణాలు మహిళా సంఘాలకు కేటాయించామన్నారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మార్కెట్ అందుబాటులో ఉంటుందన్నారు. మార్కెట్ రాష్ర్టానికే రోల్‌మోడల్‌గా నిలుస్తుందన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మార్కెట్‌ను ప్రారంభింపజేస్తామన్నారు.
అనంతరం మార్కెట్ పనులను త్వరితగతిన పూర్తి చేయించిన నగర మేయర్ పునుకొల్లు నీరజ, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభిని అభినందించారు. పర్యటనలో సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఖమ్మం ఏఎంసీ చైర్మన్ దోరెపల్లి శ్వేత, బీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, తన్నీరు శోభారాణి ఉన్నారు.