ఖమ్మం వ్యవసాయం/కూసుమంచి/అశ్వారావుపేట టౌన్/కరకగూడెం/పెనుబల్లి, జూన్ 22 : ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా శనివారం మోస్తరు వర్షం కురిసింది. విత్తనాలు పెట్టి ఎదురుచూస్తున్న రైతన్నల కళ్లల్లో ఆనందం నింపింది. వ్యవసాయం సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి సరైన వాన కురవకపోవడంతో అన్నదాతలు నిరాశలో ఉన్నారు. భూమిలో పెట్టిన పత్తి విత్తనాలు మొలకెత్తకపోవడంతో భయంభయంగా ఉన్న రైతులు శనివారం కురిసిన వర్షంతో ఊపిరిపీల్చుకున్నారు. ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో రైతులందరూ విత్తనాలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. వ్యవసాయ బోర్లు, చెరువుల కింద వరి నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్నారు. మరో రెండు, మూడు వర్షాలు కురిస్తే వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతాయని రైతులు చెబుతున్నారు.
కరకగూడెంలో భారీ వర్షం
కరకగూడెం మండలవ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు కుండపోత వర్షం కురిసింది. దీంతో వాగులు, చెరువులకు కొత్తనీరు చేరుతున్నది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రైతులు నార్లు పోసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆనందంతో దుక్కులు దున్నుకుంటున్నారు. వర్షం కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.
ఖమ్మం నగరంలో..
ఖమ్మం నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కొద్దిరోజులుగా తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు ఉపశమనం కలిగింది. శనివారం ఉదయం నుంచి మేఘాలు అలుముకోవడంతో వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం కురిసింది. నగరంలో ట్రాఫిక్‌కు స్పల్ప అంతరాయం కలిగింది. పాదచారులు, ద్విచక్ర వాహనదారులు కొంత అసౌకర్యానికి గురయ్యారు.
పెనుబల్లిలో…
మండలవ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి చిరు జల్లులతో మొదలై శనివారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. దీంతో వారం రోజుల క్రితం కరివేద విధానంలో చల్లిన రైతులు వడ్లు మొలకెత్తడంతో పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. కొందరు సాయంత్రం వరకు వర్షం ఎక్కువగా కురుస్తుందేమోననే ఉద్దేశంతో నీళ్లు బయటకు తరలించేందుకు ప్రయత్నాలు సాగించారు. వీఎం బంజర, టేకులపల్లి, లంకాలపాడు గ్రామాల్లో అధిక వర్షం కురవడంతో రైతులు సాగుపై దృష్టి సారించారు.