
ఖమ్మం:ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు రాజకీయ పక్షాలు సహకరించాలని రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం టీఆర్ఎస్ అభ్యర్ధి తాతా మధు ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పల్లా రాజేశ్వరరెడ్డి జిల్లాకు చెందిన శాసనసభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
టీఆర్ఎస్ హయాంలో ఖమ్మం జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 75శాతానికి పైగా మెజార్టీ స్థానాలు టీఆర్ఎస్కే ఉండటంతో తాతా మధు ఎమ్మెల్సీగా గెలుపొందడం ఖాయమని, నామినేషన్ వేసిన రాజకీయపక్షాలు, స్వతంత్ర అభ్యర్ధులు జిల్లా అభివృద్ధిని పరిగణలోకి తీసుకుని నామినేషన్లు ఉపసంహరించుకుని ఎన్నిక ఏకగ్రీవం చేయడం ద్వారా జిల్లా అభివృద్ధికి కలిసి రావాలని రాజేశ్వరరెడ్డి సూచించారు.
వామపక్ష ఉద్యమనేతగా, విద్యార్ధి నాయకునిగా, తెలంగాణ ఉద్యమంలో కీలకనేతగా తాతా మధుసూదన్ సేవలందించారని, మధు సేవలను గుర్తించి ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అవకాశం ఇచ్చారని పల్లా తెలిపారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, శాసనసభ్యులు కందాల ఉపేందర్‌రెడ్డి, హరిప్రియా నాయక్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర, మహబూబాబాద్ జడ్పీ చైర్మన్ ఆంగోతు బిందు, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ డి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.