సత్తుపల్లి టౌన్, అక్టోబర్ 25: బీఆర్ఎస్ది ప్రజాసంక్షేమ మ్యానిఫెస్టో అని ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బుధవారం ఆయన సత్తుపల్లి పట్టణంలోని 6, 7, 8, 9, 18, 19, 20, 21, 22, 23 వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో సత్తుపల్లిలో అభివృద్ధి పనులు చేపట్టానన్నారు. ముస్లింల కోసం షాదీఖానా, రజకులకు చాకలి ఐలమ్మ భవన్, దళితులకు అంబేద్కర్ ఆడిటోరియం నిర్మిస్తున్నామన్నారు. పట్టణంలో సువిశాలమైన మునిసిపల్ భవన్ నిర్మించామన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రతి వ్యక్తికి ‘కేసీఆర్ బీమా’ వర్తింపజేస్తారన్నారు. గతంలో కేవలం రైతులకు మాత్రమే బీమా సౌకర్యం ఉండేదని, వచ్చే సంక్రాంతి నాటికి అందరికీ బీమా వర్తిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అంటూ ప్రచారంలో ప్రజలను మోసగిస్తున్నదన్నారు.
కర్ణాటక ప్రభుత్వం ఉచిత విద్యుత్ అంటూ రైతులను మోసం చేసిందన్నారు. దీంతో అక్కడి రైతులు తన సరిహద్దు ప్రాంతాలకు వచ్చి కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలు బీఆర్ఎస్కు ఓటు వేసి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. సత్తుపల్లి మరింత అభివృద్ధి సాధించాలన్నా, మున్ముందు సత్తుపల్లి జిల్లాగా ఏర్పడాలన్నా అది బీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. ప్రచారంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మునిసిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, ఆత్మచైర్మన్ వనమా వాసు, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, చాంద్‌పాషా, మల్లూరు అంకమరాజు, అమరవరపు కృష్ణారావు, అమరవరపు విజయనిర్మల, పాషా, హనీషా, రఫీ, సూరంశెట్టి సురేశ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రఫీ పాల్గొన్నారు.