ఖమ్మం, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లాను పర్మాటక గుమ్మంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పేర్కొన్నారు. ఖమ్మం ఖిల్లాకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా దానిని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. పర్యాటక అభివృద్ధిపై హైదరాబాద్‌లోని సెక్రటేరియట్లో గురువారం సమావేశం నిర్వహించిన ఆయన.. ఖమ్మం జిల్లాలో నిర్మించ తలపెట్టిన రోప్‌వే పనులపై తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, ఎండీ ప్రకాశ్‌రెడ్డిలతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఖమ్మం ఖిల్లాపై రోప్‌వే పనులను శరవేగంగా చేపట్టాలని ఆదేశించారు. లోయర్ పాయింట్ నిర్మాణానికి లకారం చెరువు పరిసర ప్రాంతం అనువుగా ఉంటుందని అన్నారు. అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఖమ్మం ఖిల్లాను టూరిజం హబ్‌గా తీర్చుదిద్దాలని సూచించారు. రోప్‌వేతోపాటు అమ్యూజ్మెంట్ పార్కులు, హోటళ్లు నిర్మించాలని అన్నారు. వాటర్ ఫాల్స్, హాళ్ల నిర్మాణం రెండో దశలో చేపట్టాలని ఆదేశించారు. ఖమ్మం కలెక్టర్, కేఎంసీ కమిషనర్‌తో చర్చించి వెంటనే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
భద్రాద్రిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, వైజ్ఞానిక యాత్రలకు శ్రీకారం చుడతామని వివరించారు. నేలకొండపల్లి బౌద్ధస్తూపం, భక్తరామదాసు ధ్యాన మందిరం, కూసుమంచి శివాలయం టూరిజం సర్క్యూట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రోప్‌వే పనులకు సంబంధించి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇందుకోసం ఆ రంగంలో పేరొందిన సంస్థలను సంప్రదించినట్లు చెప్పారు.