ఖమ్మం, అక్టోబర్ 20: దీపావళి నుంచి నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం నగరంలో నూతనంగా ఏర్పాటు అవుతున్న కాలనీలు, విలీన గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం కల్పిస్తూ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఖమ్మం నగరంలో ఆదివారం పర్యటించిన ఆయన.. 16వ డివిజన్ శ్రీరాంనగర్ రోడ్డు నంబర్ 13లో రూ.1.95 కోట్ల టీయూఎఫ్ ఐడీసీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. నగరంలో ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉంటే దోమలతో ఇరుగూపొరుగూ వారు ఇబ్బందులు పడుతుంటారని అన్నారు. అందుకని ఆయా స్థలాల యజమానులతో చర్చించి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, యజమానులు పట్టించుకోకుంటే నోటీసులు జారీ చేయాలని కేఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు. ఇటీవలి మున్నేరు వరదల్లోని కొందరు ముంపు బాధితులకు ఇప్పటి వరకు పరిహారం అందలేదంటూ దరఖాస్తులు వచ్చాయని అన్నారు.
నిజంగా పేదలు ముంపునకు గురై ఉంటే సర్వే చేసి పరిహారం అందజేస్తామని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, పేదలు సంతోషంగా ఇందిరమ్మ ఇళ్లలో ఉండేలా చూస్తామని అన్నారు. అనంతరం కేఎంసీ కమిషనర్ అభిషేక్ మాట్లాడుతూ.. శంకుస్థాపన చేసిన పనులను రెండు రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. 16వ డివిజన్లో దాదాపుగా 1,500 కుటుంబాలకు వరద పరిహారం అందించామని, వరదల కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబానికీ సహాయం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఆర్డీవో గణేశ్, కార్పొరేటర్ మోడారపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
అయితే, ఈ సభలో గత ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో మంత్రి తుమ్మల పలు అబద్ధాలు ప్రస్తావించారు. గత కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో కొనసాగిన గడిచిన పదేళ్లలో కచ్చితంగా పంటల సీజన్‌కు ముందుగానే పంటల పెట్టుబడి కోసం రైతుబంధును అందించినప్పటికీ.. ‘గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రైతుబంధును మొన్న మేం చెల్లించాం’ అంటూ అబద్ధాలు మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమాన్ని విస్మరించి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోందంటూ ఆరోపించారు. తమ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ రుణమాఫీ చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని అన్నారు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదంటూ ఆరోపణలు చేశారు.