కూసుమంచి, సెప్టెంబర్ 23 : “వరదల కారణంగా దెబ్బతిన్న సాగర్ కాల్వల పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? 20 రోజులు దాటినా ఇంకా ఎన్ని రోజులు పనులు చేస్తారు? నీటిపారుదల శాఖ ఉండి ప్రయోజనం ఏమిటి? జిల్లాలో లక్షలాది ఎకరాల పంట భూములు ఎండిపోయిన తర్వాత నీరిచ్చి ఏం లాభం? మీరు రైతులతోనే ఆడుకుంటారా?” అని స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇరిగేషన్ అధికారులు, కాల్వ మరమ్మతు పనులు చేస్తున్న గుత్తేదారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత టి.హరీశ్‌రావు సోమవారం హైదరాబాద్‌లో ఖమ్మం జిల్లా పాలేరు కాల్వకు సంబంధించి మరమ్మతులు చేపట్టకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విలేకరుల సమావేశం నిర్వహించి ఆగ్రహం వ్యక్తం చేసిన కొద్ది సమయంలోనే మంత్రి తుమ్మల స్పందించి, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం, మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించడం గమనార్హం. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో గండిపడిన సాగర్ కాల్వ మరమ్మతు పనులు పూర్తి చేసి ట్రయల్ రన్ వేయగా.. మళ్లీ యూటీ మధ్యలో వాల్ క్రాక్ ఇచ్చి కూలిపోవడంతో తిరిగి శనివారం నుంచి మరమ్మతు పనులు చేపట్టిన విషయం తెలిసిందే.
అయితే పనులు ఆలస్యమవుతుండడంతో ఆయకట్టు పరిధిలో గల ఐదు నియోజకవర్గాల్లోని పొలాలకు నీరందకపోవడంతో మంత్రి మండిపడ్డారు. పనుల ఆలస్యానికి ఎవరు కారణమో తెలుసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌ను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న మంత్రి తుమ్మల పాలేరు కాల్వ ప్రాంతాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గండిపడిన తర్వాత మరమ్మతు చేసి ట్రయల్ రన్ వేసే క్రమంలో మళ్లీ వాల్ కూలిన తీరును మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా చీఫ్ ఇంజినీర్ విద్యాసాగర్‌తో మంత్రి మాట్లాడుతూ.. ‘మీ డిపార్ట్మెంట్ ఎందుకు ఉంది? రైతుల పంటలకు నీటి అవసరం ఉన్న సమయంలో ఇవ్వకుండా.. మీరంతా ఎందుకు? అసలు మీ ప్లాన్ ఏమిటి?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో ఆలస్యం ఎందుకు అవుతున్నదని గుత్తేదారు ముత్తయ్యను ప్రశ్నించారు. ఇంతమంది ఉండి.. కాల్వ వాల్ బలహీనంగా ఉన్నప్పుడు గుర్తించకపోవడం ఏమిటన్నారు. జిల్లాలో సాగర్ ఆయకట్టు రైతులకు సాగునీరు లేకపోవడంతో 20 రోజులుగా నానా ఇబ్బందులు పడుతున్నారని, మీరంతా ఉండి ఏం చేస్తున్నట్లని మంత్రి ప్రశ్నించారు.
అలాగే రెండోసారి జరిగిన కాల్వ లీక్‌పై ఆరా తీశారు. ఎప్పటి వరకు నీరు ఇస్తారు? యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని, అందుకు తగ్గట్లుగా పనులు జరగాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వచ్చిన రోజు కాల్వను మూసివేసి పనులు చేయమని చెప్పాం.. కానీ.. ప్రయోజనం లేదన్నారు. అధికారుల సమన్వయ లోపం వల్లే పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీఈ విద్యాసాగర్, గుత్తేదారు ముత్తయ్య, ఈఈలు వెంకటేశ్వర్లు, ఏసీపీ తిరుపతిరెడ్డి, అనన్య, డీఈలు, నాయకులు రవికుమార్, వెంకటరెడ్డి, సుధాకర్‌రెడ్డి, సురేశ్, వీరభద్రం, ఉపేందర్, మోహన్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.