రఘునాథపాలెం, జనవరి 2: ఖమ్మం నియోజకవర్గంలోని ఏకైక మండలంగా ఉన్న రఘునాథపాలెం అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని ఈర్లపూడి, లచ్చిరాంతండా, దొనబండ గ్రామాల్లో రూ.88.75 లక్షల వ్యయంతో నిర్మించిన పలు రకాల అభివృద్ధి పనులను సోమవారం ఆయన ప్రారంభించి ప్రసంగించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి బీఆర్ఎస్ పాలనలో జరిగిందని గుర్తుచేశారు.
గతంలో రఘునాథపాలెం మండలానికి రూ.2 కోట్లు అభివృద్ధి పనులకు రావడం కష్టంగా ఉండేదన్నారు. కానీ ఇప్పుడు తన హయాంలోనే 692 అభివృద్ధి పనులకు రూ.261.71 కోట్లు వెచ్చించుకొని అభివృద్ధి అంటే ఏమిటో చూపించామని వివరించారు. అనంతరం ఆయా గ్రామాల్లో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ల గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు భుక్యా గౌరి, అజ్మీరా వీరూనాయక్, గుత్తా రవి, మందడపు నర్సింహారావు, మందడపు సుధాకర్, లక్ష్మణ్‌నాయక్, మాదంశెట్టి హరిప్రసాద్, మాలోత్ ప్రియాంక, లక్ష్మీప్రసన్న, దేవ్‌సింగ్, కుర్రి నాగేశ్వరరావు, మాలోత్ తారాచంద్, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.