భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అమలవుతున్న పథకాలతో దేశమంతా తెలంగాణ వైపే చూస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 46 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని స్పష్టం చేశారు. కొత్తగూడెం క్లబ్లో మంగళవారం జరిగిన నూతన పింఛన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వృద్ధాప్యంలో ఒకరిపై ఆధారపడకుండా గౌరవంగా బతికేందుకే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని తెచ్చినట్లు గుర్తుచేశారు. పింఛన్లు పొందడానికి అర్హత ఉన్న 65 ఏళ్ల వయసుసు 57 ఏళ్లకు తగ్గంచడం ద్వారా అనేకమంది పేదలకు మేలు కలుగుతెందని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46 లక్షల మందికి సామాజిక పింఛన్లు మంజూరు అందిస్తున్నామని, ఇందుకు గాను ఏడాదికి రూ.11,600 కోట్లు వెచ్చిస్తున్నామని అన్నారు.
రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి సైతం అభినందిస్తున్నట్లు గుర్తుచేశారు. భద్రాద్రి జిల్లాలో గతంలో 98,755 మందికి వివిధ పింఛన్ల ద్వారా రూ.21.15 కోట్లు చెల్లిస్తున్నామని, ఈ నెల నుంచి అదనంగా 28,427 మందికి నూతన పింఛన్లు మంజూరు చేసి రూ.5.93 కోట్లు చెల్లించనున్నామని అన్నారు. నూతన కలెక్టరేట్, నూతన వైద్య కళాశాల భవనాలను అతి త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రారంభించి జిల్లా ప్రజలకు అంకితం చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వానికి పేదరికమే ప్రామాణికమని, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఒంటరి మహిళలకు పింఛన్లు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. ఈ పింఛన్ల మంజూరుతో ఆధారం లేని నిరుపేద కుటుంబాలకు ఆసరా లభించినట్లు అవుతుందని అన్నారు. అనంతరం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కూడా మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషనం, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మీ, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్డీవో మధుసూధన్ రాజు, జడ్పీ సీఈవో విద్యాలత, ఎక్సైజ్ శాఖ అధికారి జానయ్య తదితరులు పాల్గొన్నారు.