మామిళ్లగూడెం, ఆగస్టు 20: రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల స్క్రూట్నీ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని తాత్కాలికంగా నియమించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఎల్ఆర్ఎస్, భారీ వర్షాలు, ధరణి, ఆర్వోఆర్ చట్టం తదితర అంశాలపై హైదరాబాద్ సచివాలయం నుంచి సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు, జిల్లాల్లోని కలెక్టర్లతో మంగళవారం ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఖమ్మం కలెక్టరేట్ నుంచి ఆయన పాల్గొని మాట్లాడారు.
దాదాపు 20 లక్షలకుపైగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నందున మార్గదర్శకాల ప్రకారం కలెక్టర్లు శ్రద్ధ చూపి వాటిని మూడు నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలను సేకరించి జీపీఎస్ ద్వారా యాప్‌లో నమోదుచేయాలని సూచించారు. అదే సమయంలో ఈ భూములు నీటి వనరుల బఫర్ జోన్లు, నాలా, చెరువులు, చారిత్రక కట్టడాలు, రక్షణ భూముల వంటి వాటి పరిధిలోవి కావని ధ్రువీకరించుకోవాలని సూచించారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ద్వారా ఎక్కడా ప్రభుత్వ భూమికి నష్టం కలగవద్దని ఆదేశించారు. అలాగే, రాబోయే ఐదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ధరణి పెండింగ్ దరఖాస్తులను కూడా పరిష్కరించాలన్నారు. తిరస్కరించే దరఖాస్తులకు కారణాలను తెలియజేయాలన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లును ప్రతిపాదించిందని అన్నారు. దీనిపై ఈ నెల 23, 24 తేదీల్లో జిల్లాలో వర్క్‌షాపులు నిర్వహించాలని, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి మార్పులు, మెరుగైన సూచనలపై ఫీడ్‌బ్యాక్ అందించాలని సూచించారు. ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ పాల్గొన్నారు.