ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 05 : ఎల్ నినో ప్రభావం పడకుండా ముందస్తు చర్యలు తీసుకుని మున్సిపల్ ప్రజలకు తాగునీటి సరఫరా నిరంతరాయంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత తెలిపారు. శనివారం ఈఎంసి కౌన్సిల్ సమావేశం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ అధ్యక్షతన జరిగింది. తొలత మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి 59 అంశాలతో కూడిన రూ.1.50 కోట్ల నిధులకు సంబంధించి వివిధ రకాల తీర్మానాలను అజెండా రూపంలో సమావేశంలో పెట్టారు. అనంతరం అధికారులు, కౌన్సిలర్లను ఉద్దేశించి చైర్పర్సన్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు తగ్గాయని, ఆ ప్రభావం తాగునీటి సరఫరాపై లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రెండవ వార్డ్ అందుగల మదర్ థెరిసా ట్రస్ట్ సమీపంతో పాటు, ఆయా వార్డులలో మురుగునీరు నిల్వలు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీలకు తావు లేకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వైకుంఠధామానికి విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోబోతున్నట్లు ఆమె పేర్కొన్నారు. పూర్వపు పంచాయతీ కార్యాలయాలను జోనల్ కార్యాలయాలుగా మార్చినందున, అట్టి కార్యాలయాల్లో అవసరమైన ఫర్నిచర్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. తద్వారా సంబంధిత కౌన్సిలర్లు, వార్డు ఆఫీసర్లు, స్థానిక ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇకనుంచి ప్రతి ఇంటీ త్రాగునీటి సరఫరా నల్ల కనెక్షన్ ను ఆన్లైన్లో పొందుపరిచేందుకు, భువన్ యాప్ ద్వారా ప్రతి ఇండ్లు ఆన్లైన్లో పొందుపరచడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. మున్సిపల్ అభివృద్ధికి అధికారులు సిబ్బంది, కౌన్సిలర్లు వార్డుల వారిగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, వార్డుల కౌన్సిలర్లు, వివిధ విభాగాల మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.